కాంగ్రెస్ నాయకుడు అదృశ్యం!
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:37 PM
జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రైతు సంఘం మండల అధ్యక్షుడు నాగిరెడ్డి ఈనెల 27న రాత్రి అదృశ్యం కావడం కలకలం సృష్టించింది.
- ఆశించిన అవకాశాలు దక్కక మనస్తాపం
- కర్నూలు పట్టణంలోని ఓ లాడ్జిలో ప్రత్యక్షం
- అయిజ మునిసిపాలిటీలో కలకలం
అయిజ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రైతు సంఘం మండల అధ్యక్షుడు నాగిరెడ్డి ఈనెల 27న రాత్రి అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. మునిసిపల్ ఎన్నికల్లో తాను ఆశించిన అవకాశాలు దక్కక పోవడంతో ఆయన మనస్తాపం చెందారు. 27వ తేదీన మొబైల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకొని, సహచరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కర్నూల్‌కు వెళ్లిపోయాడు. బుధవారం ఆయన స్థానికంగా కనిపించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కంగారు పడ్డారు. చివరకు అతడి సహచ రుడి ఫోన్ నెంబర్ ఆధారంగా లోకేషన్‌ను ట్రేస్ చేశారు. అతడు కర్నూలులోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడి వెళ్లి అతడిని బుజ్జగించి అయిజకు తీసుకొచ్చారు. ఈ విషయంపై నాగిరెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన సమాచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. వైద్య పరీక్షల కోసం కర్నూలుకు వెళ్లినట్లు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ ప్రకాష్‌గౌడు, ప్రహ్లాదరెడ్డి, కాంగ్రెస్ పార్టి రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలిఆచారి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు సంకాపూర్ రాముడు ఉన్నారు.