కాంగ్రెస్ దూకుడు..!
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:16 PM
వచ్చే సంవత్సరం మార్చిలో జరగనున్న మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
- అందరి కంటే ముందే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ‘సామ’ ఖరారు
- నామినేషన్ల వరకు వేచి చూసే ధోరణికి స్వస్తి చెప్పిన వైనం
- బీజేపీలో పోటీ.. డోకూరు పవన్ పేరు విస్తృతంగా ప్రచారం
- బీఆర్‌ఎస్‌లో ఎటూ తేలని పరిస్థితి.. మాజీల పైన పార్టీ ఆశలు
- ఓటర్ నమోదు ప్రక్రియలో బిజీబిజీగా పలు పార్టీల నాయకులు
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : వచ్చే సంవత్సరం మార్చిలో జరగనున్న మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతీసారి మాదిరిగానే గత ఎలక్టోరల్ రోల్‌లో పేర్లు ఉన్నవారు కూడా కొత్తగా ఫామ్-18ను పూర్తి వివరాలతో సమర్పించాల్సి ఉంటుంది. 2023 నవంబర్ 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పట్టాభద్రులు ఓటర్ నమోదు చేసుకోవడానికి అర్హులు కాగా.. రాజకీయ పార్టీలు సాధ్యమైనంత మంది ఓటర్లను నమోదు చేయించడానికి అవగాహన కల్పిస్తున్నాయి. సోషల్ మీడియా, పార్టీ కార్యకర్తల ద్వారా ఓట్ రిజిస్ర్టేషన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. సాధారణంగా అధికార పార్టీకి కొంత ఎక్కువ మైలేజీ ఉంటుందని అంటారు. కానీ గడిచిన కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలిస్తే కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్‌లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందింది. అలాగే మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కూడా బీజేపీ గెలుచుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కోల్పోయింది. అయితే ఇప్పుడు మాత్రం చాలా కచ్చితత్వంతో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. నామినేషన్ల వరకు కూడా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో కూడా స్పష్టత రాదు.. అలాంటి పార్టీలో అనూహ్యంగా ఓటర్ నమోదు ప్రక్రియ సమయంలోనే అభ్యర్థిగా సామ రామ్మోహన్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఇతరులకు ఆశలు పెంచడం, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆశించే నేతలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉండటంతో వాటికి చెక్ పెట్టేందుకే ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
చాలామంది ఆశించినా..
మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టాభద్రుల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు. రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ విజయం సాధించగా.. ఒకసారి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో డాక్టర్ చిన్నారెడ్డి పోటీ చేసినా.. అంతగా ఓట్లు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో గెలవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ప్రతీసారి అభ్యర్థి ఎంపిక విషయంలోనే గందరగోళ పరిస్థితి ఉండగా.. ఈసారి ముందుగానే అభ్యర్థిని ఖరారు చేశారు. చాలామంది ఈ అభ్యర్థిత్వం కోసం పోటీపడినా సామ రామ్మోహన్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉండటం, పార్టీ విధానాలను మీడియా, కమ్యూనికేషన్స్ ద్వారా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోతుండటంతో ఆయన పేరుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో ఆయన ఇక నేరుగా ఓటర్ల నమోదు ప్రక్రియ, ప్రచారంలో వేగం పెంచనున్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లో తర్జనభర్జన..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో కొంత ప్రభావం చూపినా.. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో తమ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తున్నప్పటికీ.. సిట్టింగ్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పోటీకి నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె స్థానంలో ఎవరైనా మాజీ ఎమ్మెల్యేను లేదా ఇతర నేతను ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓసీకి సీటు ఖరారు చేసింది. ప్రస్తుతం గద్వాలకు చెందిన మాజీ శాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ పేరు వినపడుతుండగా.. ఇంకా ఒకరిద్దరు బీసీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ విషయంలో మొదటి నుంచీ డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి ధీమాగా పనిచేస్తూ.. తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుండటంతో ఆయన పేరును అధిష్ఠానం ఖరారు చేస్తుందని భరోసా ఏర్పడింది. అయితే షాద్‌నగర్‌కు చెందిన నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి కూడా బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అలాగే ఒక ప్రైవేటు టీచర్స్ యూనియన్ నేత కూడా ఎమ్మెల్సీగా పోటీకి ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల దూకుడు ఈసారి కాంగ్రెస్ కనబరుస్తుండటం గమనార్హం.