ఓటర్ల జాబితాపై ఆందోళన
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:24 PM
పాలమూరు కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల జాబితాపై నెలకొన్న గంధరగోళ పరిస్థితిపై రాజకీయ పార్టీలలో ఆందోళనలు నెలకొంటున్నాయి.
- కమిషనర్ కార్యాలయానికి ఫార్యాదుల వెల్లువ
- బీఆర్‌ఎస్, బీజేపీ ఫిర్యాదుతో ఆశావాహుల్లో టెన్షన్
మహబూబ్‌నగర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల జాబితాపై నెలకొన్న గంధరగోళ పరిస్థితిపై రాజకీయ పార్టీలలో ఆందోళనలు నెలకొంటున్నాయి. డివిజన్లలో నెలకొన్న ఓటర్ల గజిబిజీపై అన్ని పార్టీల నాయకులు కార్పొరేషన్‌కు క్యూ కడుతున్నారు. వరుస ఫిర్యాదులతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈనెల 10న తుది ఓటర్ల జాబితా ప్రచురించడంతో అప్పటి వరకు తప్పులను సరిచేస్తారా? లేదా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. తప్పులను సరిచేయకుండా ఎన్నికలకు వెళ్తే కోర్టు మెట్లు ఎక్కుతామని ఆయా పార్టీల నాయకులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు మాత్రం చిన్నచిన్న సవరణలు మినహా తప్పుల తడకగా లేదని, ఇది వరకు 49 వార్డులు ఉండగా, ఇప్పుడు 60 డివిజన్‌లకు పెరగడంతో కొంతమంది ఓటర్లు పక్క వార్డులోకి వెళ్లి ఉండవచ్చు తప్పా తప్పులతడక కాదని చెబుతున్నారు. అసలు అసెంబ్లీ ఎన్నికలో 2 లక్షల ఓటర్లు ఉండగా, ఇప్పుడు రెండు మండలాలు లేకున్నా 1.92 లక్షల మంది ఓటర్లు ఎక్కడినుంచి వచ్చారని ప్రశ్నిస్తున్నారు.
సవరించకపోతే కోర్టుకు వెళ్తాం..
ఓటర్ల జాబితాను గంధరగోళంగా తయారు చేశారని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. డివిజన్ మధ్యలో ఉన్న ఓటర్లును ఇతర డివిజన్‌లో కలుపడం, శివశక్తినగర్‌లో ఒకే ఇంటి నెంబరుపై ఇద్దరు హిందూ ఓటర్లు, ఇద్దరు ముస్లీం ఓటర్లు ఉండటం విచారకరం. సవరణ చేయకుండా ఎన్నికలకు వెళ్తే కోర్టును ఆశ్రయిస్తాం. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. బీజేపీ నాయకులు రమేశ్‌కుమార్, పాండురంగారెడ్డి, నర్సింహులు, వీరన్న, సుబ్రమణ్యం, యాదయ్య, హరికృష్ణ శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.
డివిజన్ల విభజన శాస్త్రీయంగా జరగలేదు..
నగరంలో డివిజన్‌ల విభజన శాస్త్రీయంగా జరగలేదని, అన్ని డివిజన్‌లో ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు అన్నారు. శనివారం ఓటర్ల జాబితాపై బీఆర్‌ఎస్ నాయకలు కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చాలా డివిజన్‌లో నగరంలోని పలు డివిజన్‌లకు సంబంధించిన ఓటర్లను చేర్చారని వెంటనే వీటిని సరిచేయాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ మాజీ చైర్మన్ కొరమోని నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్ గణేష్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, సతీష్ పాల్గొన్నారు.