నేడు పాలమూరుకు సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:13 PM
కేవలం పదిరోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో అమేజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఉన్న అమరరాజా గిగా కారిడార్‌కు చేరుకోనున్నారు.
మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో పర్యటన
దివిటిపల్లి అమరరాజా గిగా కారిడార్‌లో సీక్యూపీ..
కొత్తకోటలో బాలికల పాఠశాల నూతన భవనం ప్రారంభం
మహబూబ్‌నగర్/కొత్తకోట, జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేవలం పదిరోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో అమేజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఉన్న అమరరాజా గిగా కారిడార్‌కు చేరుకోనున్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంటును ప్రారంభిస్తారు. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోట మునిసిపాలిటీకి చేరుకుని రూ.కోటిన్నరతో నిర్మించిన బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
మహబూబ్‌నగర్ షెడ్యూల్ ఇలా..
-సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 1:15 గంటలకు దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలిక్యాప్టర్‌లో చేరుకుంటారు.
- 1:20 నుంచి 2:20 వరకు అమర రాజా గిగా కారిడార్‌లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంటును ప్రారంభించి, ప్రసంగిస్తారు.
- 2:20కి దివిటిపల్లి నుంచి వనపర్తి జిల్లా కొత్తకోటకు హెలిక్యాప్టర్‌లో బయల్దేరతారు.
కొత్తకోట షెడ్యూల్ ఇలా..
- ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2:40 గంటలకు పోలీస్ స్టేషన్ సమీపంలో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనంలో రోడ్డు మార్గంలో పాఠశాలకు చేరుకుంటారు.
- 2:45 గంటలకు పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
- 3:45 గంటల వరకు అక్కడే ఉంటారు.
- ఈ సందర్భంగా కొత్తకోట, మదనాపురం మండలాలకు చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు 1,900 మందితో ముఖాముఖి మాట్లాడతారు. పది మంది విద్యార్థులను పాఠ్యాంశాలపై సీఎం ప్రశ్నించనున్నారు.
- ముఖాముఖి అనంతరం హెలిక్యాప్టర్‌లో హైదారాబాద్‌కు వెళ్తారు.