దంపతుల ప్రాణం తీసిన చీటీల వ్యాపారం
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:25 PM
చీటీల వ్యాపారం ఓ దంపతులను అప్పుల ఊబిలోకి నెట్టింది... చీటీ ఎత్తుకున్న వారు సరిగా డబ్బులు తిరిగి చెల్లించకపోవడం.. చీటీలు ఎత్తుకునే వారు డబ్బులు ఇవ్వాలని చేస్తున్న ఒత్తిడులకు తాళలేక దంపతులు సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
- మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని సూసైడ్ నోట్
మహబూబ్‌నగర్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : చీటీల వ్యాపారం ఓ దంపతులను అప్పుల ఊబిలోకి నెట్టింది... చీటీ ఎత్తుకున్న వారు సరిగా డబ్బులు తిరిగి చెల్లించకపోవడం.. చీటీలు ఎత్తుకునే వారు డబ్బులు ఇవ్వాలని చేస్తున్న ఒత్తిడులకు తాళలేక దంపతులు సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ప్రేమ్‌నగర్‌కు చెందిన దంపతులు కాట్రవల్లి శ్రీనివాసులు(58), కాట్రవల్లి జ్యోతి(52) కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల చీటీలు నడుపుతున్నారు. అయితే పలువురు చీటీలు ఎత్తుకొని డబ్బులు చెల్లించలేదు. దీనికి తోడు చీటీ ఎత్తుకున్న వారికి డబ్బులు చెల్లించేందుకు ఇబ్బందులు వచ్చాయి. అప్పుచేసి కొందరికి డబ్బులు చెల్లించినా, ప్రతీనెల చీటీ ఎత్తుకునే వారికి డబ్బులు చెల్లించడం ఇబ్బందిగా మారింది. చీటీ ఎత్తుకున్న వారికి డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఇంటి వద్దకు తిరగడం, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. చీటీ ఎత్తుకున్న ఓ వ్యక్తి డబ్బులు అడిగితే చనిపోతా అని బెదిరిస్తుండటం, చీటీ ఎత్తుకున్న కొందరికి డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదని బుకాయిస్తున్నారని నోట్‌లో పేర్కొన్నారు. అప్పటికే పలువురితో అప్పులు చేసి ఆర్థిక సమస్యలతో సతమతమవుతుండటంతో తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తమ ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వెళ్ళి తలుపు తట్టగా స్పందన రాలేదు. దీంతో బలవంతంగా తలుపులు తీసి లోపలికి వెళ్ళి చూడగా ఓ గదిలో భార్య మంచంపై విగతజీవిగా పడి ఉండగా, భర్త నైలాన్ తాడుతో ఊరి వేసుకొని మరణించి ఉన్నాడు. ముందుగా భార్య ఆత్మహత్య చేసుకున్న తరువాత భర్త చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. టు టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఆచారి ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురికి పెళ్ళికాగా, కొడుకు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి మేనమామ వెంకటేశ్వర్లు ఫిర్యాదుమేరకు టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.