బందీ అవుతున్న బాల్యం
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:22 PM
స్వేచ్ఛా వాతావరణంలో ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన బాలలు పనిలో బందీ అవుతున్నారు. అక్షరాలు దిద్దాల్సిన సమయంలో పత్తి చేలలో పని చేస్తున్నారు.
- పనులకు వెళ్తున్న బాలబాలికలు
- కుటుంబ పేదరికమే ప్రధాన కారణం
- నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
- ప్రతి ఏటా ఆపరేషన్ ముస్కాన్, స్మైల్
- నేడు ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం
స్వేచ్ఛా వాతావరణంలో ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన బాలలు పనిలో బందీ అవుతున్నారు. అక్షరాలు దిద్దాల్సిన సమయంలో పత్తి చేలలో పని చేస్తున్నారు. పుస్తకాల సంచీతో బడికి వెళ్లాల్సిన వారు హోటళ్లు, మెకానిక్ షెడ్లలో కార్మికులుగా మారుతున్నారు.. అక్షరాలు దిద్దాల్సిన చేతులతో బట్టీల్లో ఇటుకలను మోస్తున్నారు. అందుకు తల్లిదండ్రుల పేదరికమే ప్రధాన కారణం. చదువు ప్రాధాన్యంపై వారికి అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత ఇతర కారణాలని చెప్పవచ్చు. నేడు ‘ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం’ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ, కారణాలు, నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం...
- పాలమూరు/ నారాయణపేట/నాగర్‌కర్నూల్ టౌన్/ గద్వాల క్రైం (ఆంధ్రజ్యోతి)
పేదరికం బాలల పాలిట శాపంగా మారుతోంది. ఆర్థిక స్థోమత లేక, కుటుంబ పోషణ భారమై తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంతోమంది పిల్లలు పత్తి చేలు, పరిశ్రమలు, ఇటుక బట్టీల్లో పని చేస్తున్నారు. గొర్రెలు, పశువుల కాపరులుగా మారుతున్నారు. మరికొందరు బాలలు యాచకులుగా మారుతుండటం ఆవేదన కలిగిస్తోంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయి ఫలితాలు సాధ్యం కావడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఐదేళ్లలో అధికారుల లెక్కల ప్రకారమే వివిధ పనుల్లో ఉన్న 845 మంది బాల కార్మికులను గుర్తించారు. స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం ఈ సంఖ్య అంతకు మూడింతలు అధికంగా ఉన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ పట్టణం, కోయిలకొండ మండలంలో బాలకార్మికుల సంఖ్య అధికంగా ఉంది. దేవరకద్ర, కోయిలకొండ తదితర ప్రాంతాల్లో మేకలు, గొర్రెల కాపరులుగా చిన్నారులు పనిచేస్తున్నారు. బాలానగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ పట్టణ శివారు ప్రాంతాల్లో ఇటుక బట్టిల్లో బాలలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల రిజిస్టర్‌లో పేర్లు ఉన్నా.. బాలలు (బుడగ జంగాల పిల్లలు) మాత్రం పత్తిచేలల్లో, ఇటుకల బట్టీల్లో పని చేస్తుంటారు. 2021 నుంచి 2026లో ఇప్పటివరకు అధికారులు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో 380 మంది బాల కార్మికులను గుర్తించారు. వారిలో బాలురు 329, బాలికలు 51 మంది ఉన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో 465 మంది బాలకార్మికులను గుర్తించగా, వారిలో 433 మంది బాలలు, 32 బంది బాలికలు ఉన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి...
మహబూబ్‌నగర్ జిల్లాకు ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు బతుకుదెరువు కోసం వలస వస్తున్నారు. వారు ప్రధానంగా ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు, ఇళ్లలో పని చేస్తున్నారు. వారి వెంట వచ్చే బాలలు చదువుకు దూరం అవుతున్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులతో పాటు పని చేస్తున్నారు.
- నారాయణపేట జిల్లాలో గత సంవత్సరం నిర్వహించిన అపరేషన్ మస్కాన్, స్మెల్ కార్యక్రమాల ద్వారా 71 మంది బాలలకు విముక్తి కల్గించారు. వారిలో బాలురు 51, బాలికలు 20 మంది ఉన్నారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న 34 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 54 మందిపై కేసులు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి, ఇటుకల బట్టీలతో పాటు ఇతర పనులు చేస్తున్న 35 మంది బాల కార్మికులకు విముక్తి కల్గించారు. వారిలో బిహార్‌కు చెందిన ఇద్దరు, ఒడిశాకు చెందిన 27 మంది, కర్ణాటకకు చెందిన ఇద్దరు, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఒకరు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఉన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా చైల్డ్ వైల్‌ఫేర్ అధికారి రాజేందర్‌గౌడ్ తెలిపారు.
- నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాల ద్వారా గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఏడుగురు బాలకార్మికులకు విముక్తి కల్పించారు. పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేశారు. బాలలకు పునరావాసం కల్పించి, చదువుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా లేబర్ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎక్కువ మంది బాలలు సీడ్ పత్తి చేలలో పని చేస్తున్నారు. సీడ్‌పత్తిలో క్రాసింగ్ సమయంలో చిన్న చేతులు ఉంటే దిగుబడి అధికంగా వస్తుందని యజమానులు భావిస్తున్నారు. సీజన్‌లో ఒక్కొక్కరికి రూ. 28,000 చొప్పున కూలి ఇస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా 2024లో 134, 2025లో 162 మంది, 2026లో ఇప్పటివరకు 77 మంది బాల కార్మికులను గుర్తించినట్లు జిల్లా సంక్షేమాఽధికారి సునంద తెలిపారు. వారిని పనిలో పెట్టుకున్న 15 మందిపై కేసులు నమోదు చేయించినట్లు చెప్పారు. విముక్తి కల్పించిన బాలలను బడికి పంపేలా చర్యలు తీసుకున్నామని, బాలికలను కలెక్టర్ అనుమతితో కేజీబీవీలో చేర్పించామని తెలిపారు.
1098కి ఫిర్యాదు చేయవచ్చు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం 1098 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఎవరైనా, ఎక్కడైనా బాలకార్మికులను చూస్తే ఈ నెంబర్‌కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం అందించవచ్చు. అధికారులు తక్షణమే స్పందించి బాల, బాలికలకు విముక్తి కల్పించి, వారు చదువుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.
ప్రజలు సహకరించాలి
ఎస్.జరీనాబేగం, డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్, మహబూబ్‌నగర్ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన 16 ఏళ్ల లోపు బాలలు మన జిల్లాలో పనిచేస్తున్నారు. చదువుపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. మేము గుర్తించిన వారిలో 10 మందితో పదో తరగతి, నలుగురితో ఓపెన్ ఇంటర్ పరీక్షలను రాయించగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు.