Share News

వనపర్తిలో గందరగోళం

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:35 PM

మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వనపర్తి మునిసిపాలిటీలో గందరగోళం నెలకొన్నది.

వనపర్తిలో గందరగోళం
గడువు ముగియడంతో పార్టీ బీ-ఫామ్‌ పట్టుకుని గేటు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న 25వ వార్డు అభ్యర్థి కదిరే రాములుయాదవ్‌

- సమయం ముగియడంతో అనుమతి నిరాకరణ

- ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఆగ్రహం

- కావాలనే కుట్ర చేశారని ఆరోపణ

వనపర్తి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వనపర్తి మునిసిపాలిటీలో గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పట్టణంలోని 25వ వార్డు నుంచి టికెట్‌ ఆశించిన ఏర్పుల రవియాదవ్‌, కదిరే రాములు యాదవ్‌లతో మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి చర్చలు జరిపారు. చివరకు గడువు సమయం ముగిసిన తర్వాత కదిరే రాములుయాదవ్‌కు బీ-ఫామ్‌ అందించడంతో ఆయన మునిసిపల్‌ కార్యాలయానికి పరుగులు తీశారు. అప్పటికే సమయం ముగియడంతో ఎన్నికల అధికారులు లోపలికి అనుమతించలేదు. అలాగే 7వ వార్డులో పోటీ చేస్తున్న నక్క సుజాతకు కూడా గడువుకు 10 నిమిషాల ముందు బీ-ఫామ్‌ ఇచ్చారు. ఆమె కూడా కార్యాలయానికి చేరుకునే సరిగి సమయం ముగిసిందని అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో కదిరే రాములుయాదవ్‌ అనుచరులతో కలిసి కార్యాలయం గేటు ముందు కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. దీంతో 25, 7వ వార్డుల్లో అధికార పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరూ లేకుండా పోయారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకటో వార్డు టికెట్‌ను రాగి లక్ష్మి, చుక్క జయశ్రీకి ఆశించారు. అయితే జయశ్రీకి బీఫాం ఇవ్వడంతో రాగి లక్ష్మీ తన కుమారుడు అక్షయ్‌తో కలిసి పార్టీ కార్యాలయంలో బోరున విలపించారు. పార్టీని నమ్ముకుని ఉన్నందుకే మోసం చేస్తారా అని పార్టీ పెద్దలను ప్రశ్నించారు. దీంతో వారు ఆమెను బుజ్జగించి, శాంతింప చేశారు.

Updated Date - Feb 03 , 2026 | 11:35 PM