Share News

కేంద్రం.. రాష్ట్రం... మధ్యలో ఏపీ..!

ABN , Publish Date - May 25 , 2026 | 11:51 PM

కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ‘పాలమూరు - రంగారెడ్డి’కి కీలకస్థానం లభిస్తోంది.

కేంద్రం.. రాష్ట్రం...  మధ్యలో ఏపీ..!

మైనర్‌ ఇరిగేషన్‌, పోలవరం నుంచి వచ్చే వాటాగా రాష్ట్రం వాదన

కొత్త ప్రాజెక్టు.. కేటాయింపులు లేవంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

గోదావరి- కావేరి లింక్‌కు ఒప్పుకుంటే పాలమూరుకు కేంద్రం ఓకే..

డీపీఆర్‌కు ఆమోదం లేకపోవడంతో ఆర్థిక సంస్థల రుణాలు కరువు

మహబూబ్‌నగర్‌ (ఆంద్రజ్యోతి ప్రతినిధి) : కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ‘పాలమూరు - రంగారెడ్డి’కి కీలకస్థానం లభిస్తోంది. ఈ ప్రాజెక్టును ఎజెండా చేసుకుని బీఆర్‌ఎస్‌ పాదయాత్రకు సిద్ధమవుతుండగా, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని, బిల్లుల చెల్లింపు, పరిహారం విడుదల విషయంలో ఢోకా లేకుండా చూస్తామన్నారు. ఈ టర్మ్‌లోనే పీఆర్‌ఎల్‌ఐని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ నెల 23న జరిగిన కేబినెట్‌ సమావేశంలో రూ. 587 కోట్లు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారు. అయితే ఇందులో రూ. 200 కోట్ల వరకు కేవలం ఉదండాపూర్‌ నిర్వాసితులకే పరిహారం రూపంలో అందజేయాలి. ఇప్పటివరకు ఒకసారి రూ. 250 కోట్లు, ఒకసారి రూ. 150 కోట్లు నిర్వాసితులకు అందినప్పటికీ.. ఇంకా అంత మొత్తం పెండింగ్‌లో ఉంది. ఇవి కాకుండా నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల పరిధిలో కూడా కొంత మొత్తం రైతులకు చెల్లించాల్సి ఉంది. కాలువల భూసేకరణకు కూడా ఇంకా నిధులు కావాలి. గత ప్రభుత్వ హయాం చివరిలో భూసేకరణ జీవో వచ్చినా.. తర్వాత రద్దయ్యింది. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాలువలకు భూసేకరణ కూడా పూర్తి చేయాలి. అందుకు రూ. వందల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం లేకపోవడం వల్ల ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయించినవే ఖర్చు చేయలేని స్థితికి చేరిన క్షణంలో రాష్ట్ర ఆదాయం నుంచి పీఆర్‌ఎల్‌ఐ పూర్తికి నిధులు ఖర్చు చేసే అవకాశం లేదు. ఈ టర్మ్‌లోనే పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నప్పటికీ ఆర్థిక సవాళ్లను అధిగమించి పనులు ఎలా ముందుకెళ్తాయో వేచి చూడాల్సిందే.

ఎవరి వాదన వారిదే...

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు 2015లో చేపట్టారు. మొత్తం 5 లిఫ్టులు, ఆరు రిజర్వాయర్లకు సంకల్పించారు. ప్రాజెక్టు సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంతో ఇది కొత్త ప్రాజెక్టు అని ఏపీ వాదనను ప్రారంభించింది. దీనికితోడు పర్యావరణ అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు పనులు కొనసాగించడానికి తాగునీటి ప్రాజెక్టుగా చూపించి.. పనులను చేపట్టారు. బడ్జెట్‌ కేటాయింపులు కాకుండా రూ. 10వేల కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి ఇచ్చారు. కేంద్రం నుంచి డీపీఆర్‌కు అనుమతి రాకపోవడంతో ఆర్థిక సంస్థల నుంచి నిధులు రావడం లేదు. కారణం నికర జలాల కేటాయింపులు చేయకపోవడం.. ఈ నేపథ్యంలో గతంలో మైనర్‌ ఇరిగేషన్‌లో మిగిలిన 45 టీఎంసీలు, గోదావరి నీటిని పట్టిసీమకు తరలించినందుకు గాను సాగర్‌ ఎగువన వాడుకోవాలని నిర్ణయించిన 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నికర జలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. ఈలోగా కేటాయింపులు లేవని, తెలంగాణ పరస్పర విరుద్ధ వైఖరిని అవలంభిస్తోందని ఏపీ వాదన వినిపించింది. ఇప్పటికే నిధుల లేమితో ప్రాజెక్టు పనులు నిరాశాజనకంగా సాగుతుండగా.. ఏపీ వాదన, కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌కు ఆమోదం తెలపకపోవడం వంటి సమస్యలతో మరింత జఠిలంగా మారుతోంది. ఈ సమస్యలకు పరిష్కారం వచ్చేలోపు భూసేకరణ పూర్తి చేద్దామా? అంటే వేల కోట్లు బడ్జెట్‌లోవి కాకుండా కేటాయింపులు చేయాల్సి ఉంది.

గోదావరి- కావేరి లింక్‌ ప్రతిపాదనలు..

వాస్తవానికి అవిభాజ్య మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా దాదాపు 7.24 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. మిగతా మొత్తం నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోనిది.. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు అన్ని నియోజకవర్గాలకు సాగునీరు అందినట్లవుతుంది. ఇప్పుడు మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా లక్ష ఎకరాలపైన ఆయకట్టు పీఆర్‌ఎల్‌ఐ నుంచి తొలగించినట్లే.. ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి నికర జలాలు.. కొత్త ప్రాజెక్టు అని ఏపీ అడ్డుపడుతుండటం.. ఇటు బీఆర్‌ఎస్‌ పీఆర్‌ఎల్‌ఐ కేంద్రంగా పాదయాత్రకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో కేంద్రం తన దీర్ఘకాల లక్ష్యమైన నదుల అనుసంధానంలో భాగంగా సమ్మక్కసాగర్‌లో తెలంగాణ తన వాటా 47 టీఎంసీలు వదులుకుంటే సాగర్‌ ఎగువన వాడుకునే 45 టీఎంసీలతో పాటు గోదావరి, కావేరి అనుసంధానంలో భాగంగా తెలంగాణకు దక్కే 43 టీఎంసీలను కలుపుని కృష్ణాలో పాలమూరు- రంగారెడ్డికి నికర జాలలు కేటాయిస్తామని ప్రతిపాదిస్తోంది. దీనికి సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏపీ తిరిగి గోదావరి జలాలను సమ్మక్కసాగర్‌ నుంచి తీసుకెళ్తే తాము అనుమతించబోమని, దీనివల్ల దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టుకు నీరందదని వాదిస్తోంది. దీనికి బదులు ఏపీలోని పోలవరం - ప్రకాశం బ్యారేజీ - బొల్లాపల్లి క్రాస్‌ రెగ్యులేటర్‌ - సోమశిల మీదుగా అయితే అభ్యంతరం లేదని చెబుతోంది. దీనిపై కేంద్రం, రాష్ట్ర వైఖరి ఇంకా తెలియడం లేదు. అయితే నికర జలాలు లేకుండా ఆమోదం రాదు.. ఆమోదం రాకపోతే రుణాలు రావు.. రుణాలు రాకపోతే ప్రాజెక్టు పూర్తికాదు.. ప్రాజెక్టు పూర్తికాకపోతే వ్యతిరేకత వస్తుందన్నట్లు పరిస్థితి తయారైంది. జీకే లింక్‌ ప్రతిపాదనలో భాగంగానే కేంద్రం ఎంత మేరకు ఇరు రాష్ర్టాలను ఒప్పిస్తుందనే విషయంపై ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా? అనే అంశం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

Updated Date - May 25 , 2026 | 11:51 PM