Share News

దేశ భవిష్యత్‌ నిర్మాణం తరగతి గదుల్లోనే ప్రారంభం

ABN , Publish Date - May 29 , 2026 | 11:16 PM

దేశ భవిష్యత్‌ నిర్మాణం తరగతి గదుల్లోనే ప్రారంభం అవుతుందని క్రీడాశాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి అన్నారు.

దేశ భవిష్యత్‌ నిర్మాణం   తరగతి గదుల్లోనే ప్రారంభం
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి డా.వాకిటి శ్రీహరి.

- క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

నారాయణపేట న్యూ టౌన్‌, మే 29, (ఆంధ్రజ్యోతి) : దేశ భవిష్యత్‌ నిర్మాణం తరగతి గదుల్లోనే ప్రారంభం అవుతుందని క్రీడాశాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్స్‌లో టీఎస్‌ పీఆర్‌టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రతిభా పురస్కారాల ప్రదానం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో మన జిల్లా 19వ స్థానం నుంచి 14వ స్థానానికి ఎగబాకిందని తెలిపారు. భవిష్యత్‌లో ప్రథమ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మక్తల్‌ - నారాయణపేట - కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ అవార్డులు అందుకున్న విద్యార్థులు భవిష్యత్‌లోనూ ఉత్తమ ప్రతిభ చాటాలని కోరారు. కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్‌., ఎస్‌ఈఆర్‌టీల్లో మన జిల్లా ర్యాంకు సాధించడం గొప్ప విషయమన్నారు. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు మనమంతా కృషి చేద్దామన్నారు. అనంతరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్థులకు విశ్రాంత ఉపాధ్యాయుడు సత్యపాల్‌ జ్ఞాపకార్థం మెమోంటోలను మంత్రి, కలెక్టర్‌, పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా అందించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గిర్‌ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కే శ్వేత సత్యయాదవ్‌, ఏఎంసీ ఛైర్మన్‌ సదాశివారెడ్డి, డీఈవో గోవిందరాజులు, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎంఈవోలు, సెక్టోరల్‌ అధికారులు విద్యాసాగర్‌, శ్రీనివాస్‌, నాగార్జునరెడ్డి, రాజేంద్రకుమార్‌, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:16 PM