Share News

గద్వాల ఎమ్మెల్యేపై ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:33 PM

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు.

గద్వాల ఎమ్మెల్యేపై ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు
రాష్ట్ర ఎన్నికల సంఘానికి గద్వాల ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

- ప్రచార నిషేధ సమయంలో ఓటర్లతో సమావేశాలు

- సాక్ష్యాధారాలతో ఎన్నికల సంఘానికి అందజేత

- చర్యలు తీసుకోవడంతో పాటు పోలింగ్‌కు దూరంగా ఉంచాలి

గద్వాల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, 48 గంటల నిశ్శబ్ద కాలంలో నిబంధనలను ఉల్లంఘించారని, ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీశారని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ కురువ విజయ్‌కుమార్‌, బొమ్మెర రామ్మూర్తి, యాదయ్యగౌడ్‌, లీగల్‌ సెల్‌ నాయకులు సదానంద్‌లు ఆదారాలతో లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గద్వాల పట్టణంలోని 17వ వార్డుతో సహా పలు వార్డులలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పర్యటించారని పేర్కొన్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో భీమ్‌నగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌ను సందర్శించి ఓటర్లతో సమావేశం నిర్వహించారని తెలిపారు. నిశ్శబ్దకాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ ప్రచారం నిర్వహించడం ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్దమని పేర్కొన్నారు. ఓటమి భయంతో అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులను సాక్ష్యాధారాలుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనను పోలింగ్‌ దూరంగా ఉంచాలని కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా అక్కడి అధికారులకు ఆదేశాలను జారీ చేయాలని కోరారు. ఎన్నికల అధికారులు ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా చూడాలని కోరారు.

Updated Date - Feb 10 , 2026 | 11:33 PM