భీమా ఇదేమి రామా?
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:06 PM
మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక రాష్ట్రం మీదుగా 851 కిలో మీటర్లు పారుతూ నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగడిగి గ్రామ శివారులోని దత్తభీమేశ్వర దేవాలయం పక్కన కృష్ణానదిలో సంగమయ్యే భీమా నది వెలవెలబోతోంది...
వెలవెలబోతున్న భీమానదితో దిక్కుతోచని రైతులు
కృష్ణ, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక రాష్ట్రం మీదుగా 851 కిలో మీటర్లు పారుతూ నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగడిగి గ్రామ శివారులోని దత్తభీమేశ్వర దేవాలయం పక్కన కృష్ణానదిలో సంగమయ్యే భీమా నది వెలవెలబోతోంది... వందల టీఎంసీలను తీసుకువచ్చే ఈ నదికి ఎగువన వర్షాలు సమృద్ధిగా కురువక నదిలో నీరు లేక ఎడారిగా మారింది. బండలు తేలి, గంతల్లో నీరు నిలిచి ప్రైవేటు మోటార్లు పంపుల ఫుట్‌బాళ్లకు కూడా నీరు అందడంలేదు. దీంతో ఈ ప్రాంతంలో భీమా నది ఆధారంగా చేపట్టిన నారు మడులు ఎండుతున్నాయి. భీమా నది ఒడ్డున ఎత్తిపోతల పథకం పంపునకు నీరు లేక మూత పడింది. ఈ నది ఒడ్డున ఉన్న సుకురులింగంపల్లి, ఐనపూర్, కూసుమూర్తి, కళహళ్లి, తంగడిగి గ్రామ శివారులోని దాదాపు 5 వేల ఎకరాల వరి సాగు భూములున్నాయి. సన్న చిన్నకారు రైతులు, పెద్దరైతులు ఖరీఫ్, యాసంగి రెండు వరి పంటలు సాగు చేస్తూ జీవనోపాధి పొందేవారు. కానీ, ప్రస్తుతం దిక్కుతోచకుండా ఉన్నారు.