మోసాలపై అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:33 PM
సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నేరాలు చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి విద్యార్థులకు సూచించారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నేరాలు చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి విద్యార్థులకు సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియోకాల్స్ చేసి భయపెడుతున్నారని, అలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసులు డిజిటల్ అరెస్ట్ చేయరని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. సైబర్ జాగృక్త దివస్‌లో భాగంగా బుధవారం ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో సురక్షా కా తిరంగ- స్టే అలర్ట్- స్టే అవేర్ - స్టే సైబర్ సేఫ్ ప్రత్యేక సందేశంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయని, అందరికీ ఖాతాలు ఉండటంతో సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్దతులలో ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు ఈ మోసాలపై తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. నకిలీ యాప్‌లు, ఇన్వెస్టిమెంట్‌లు, సులభంగా డబ్బులు సంపాదించే పద్దతులతో ఆశలు కల్పించి మోసాలకు పాల్పడుతున్నారని, అపరిచితులు ఫోన్ చేస్తే వారికి ఆర్థిక పరమైన వివరాలు, బ్యాంక్‌లకు సంబంధించిన పిన్ నెంబర్, ఓటీపీలు తెలియజేయవద్దన్నారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ గిరికుమార్, ఎస్‌వీఎస్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జోషి, రూరల్ సీఐ గాంధీనాయక్, ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ రాజేందర్‌రెడ్డి, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ కృష్ణయ్య ఐటీసెల్ సబ్‌ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ పాల్గొన్నారు.