Share News

డిండిపై పోరు..!

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:31 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దీర్ఘకాలికంగా డిండి ఎత్తిపోతల పథకం రద్దు కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన వారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోతున్నారు.

డిండిపై పోరు..!
సర్వారెడ్డిపల్లి వద్ద కొనసాగుతున్న డిండి- ఏదుల లింక్‌ కెనాల్‌ పనులు

- ‘పాలమూరు’ను పక్కనబెట్టి డిండి పనుల పూర్తిపై ఆగ్రహావేశాలు

- లింక్‌ కెనాల్‌ మినహా నిర్మాణాలన్నీ దాదాపు పూర్తి

- లేఖలు రాసి.. ఆపినట్లు చేసి.. పూర్తి చేసిన బీఆర్‌ఎస్‌

- అనుమతులు లేవని పీఆర్‌ఎల్‌ఐ కాలువల భూసేకరణ రద్దు

- అప్పుడు డిండికి వ్యతిరేక పోరాటం.. ఇప్పుడు కాంగ్రెస్‌ మౌనం

మహబూబ్‌నగర్‌ ,సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో దీర్ఘకాలికంగా డిండి ఎత్తిపోతల పథకం రద్దు కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన వారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోతున్నారు. ఇప్పటికే కాలువల అనుసంధానం మినహా మిగతా నిర్మాణాలన్నీ పూర్తి చేసుకున్న డిండి ప్రాజెక్టు రద్దు కష్టతరం కాగా.. తమ ప్రయోజనాలను తాకట్టుపెట్టి.. ‘పాలమూరు- రంగారెడ్డి’ని పూర్తిచేయకుండా డిండి పనులను వేగం చేయడం అన్యాయమని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల జేఏసీ, పాలమూరు అధ్యయన వేదిక, ఇతర ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి కోసం ఏర్పడిన ఈ జేఏసీ.. ఈ నెల 27 నుంచి వంగూరు మండలం ఉల్పర బ్యారేజీ ప్రతిపాదిత ప్రాంతం నుంచి పాదయాత్రకు సిద్ధమవుతోంది.

అలసత్వం వల్లే అన్యాయం!

జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పరిశీలించి, పరిస్థితులను అధ్యయనం చేసిన పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల జేఏసీ నాయకులు.. నల్లమల ప్రాంతవాసుడైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లి.. తమ హక్కులను సాధించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఇప్పటికే కృష్ణా జలాల్లో నల్గొండ జిల్లా అత్యధిక మొత్తంలో నీటిని వాడుకుంటోందని, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ద్వారా నీరు వెళ్తే మరో 60 టీఎంసీలతో ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందనే వాదనను వినిపిస్తున్నారు. అత్యధిక దూరం కృష్ణానది ప్రవహించే ప్రాంతం పాలమూరు అయినప్పటికీ.. ఇక్కడి ప్రాజెక్టుల పూర్తిలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనేది జిల్లా ప్రజల ఆరోపణ.. ప్రధానంగా రాజకీయ అలసత్వం వల్లనే జిల్లాకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. నల్గొండకు చెందిన నాయకులు ఇంచు భూమి పడావు ఉండకుండా ప్రాజెక్టుల కోసం పనిచేస్తుంటే ఇక్కడి నాయకులు మాత్రం మిన్నకుండిపోతున్నారని విమర్శిస్తున్నారు.

అప్పట్లో వ్యతిరేకించి..

డిండి ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పాలమూరు ప్రజాసంఘాల నేతలు, ప్రజలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఎస్‌ఎల్‌బీసీ నుంచి లేదా శ్రీశైలం సోర్స్‌ నుంచే నేరుగా తీసుకోవాలని, కానీ పాలమూరు - రంగారెడ్డి నుంచి తీసుకోవడం అన్యాయమని చెబుతున్నారు. అయితే అప్పట్లో బీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీన్ని వ్యతిరేకించారు. అందరి సంతకాలతో ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు సారథ్యంలో లేఖలు కూడా రాశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఇందులో డిండికి రోజుకు 0.5టీఎంసీలను 60 రోజుల పాటు తీసుకోవాలి. అయితే దీన్ని అందరూ వ్యతిరేకించడంతో వట్టెం నుంచి డిండిని లింక్‌ చేయాలనే ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు చేశారు. కేవలం లింక్‌ ప్రస్తావన మాత్రమే లేకుండా మిగతా పనులన్నింటికీ పచ్చజెండా ఊపారు. మొత్తం రిజర్వాయర్లలో మెజారిటీ పూర్తి చేశారు. ఉల్పర బ్యారేజీ, ఎర్రపల్లి- గోకారం పనులు మాత్రం తీవ్ర ప్రతిఘటనల వల్ల పూర్తి కాలేదు. కేవలం లింక్‌ విషయంలో స్తబ్దత పాటించి.. మిగతా పనులు పూర్తిచేయడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సఫలీకృతమైంది. కానీ సోర్స్‌ అయిన పాలమూరు - రంగారెడ్డి పనులు మాత్రం నేటికీ అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. కేవలం లింక్‌ చేసే పనులు మినహా అనుమతులు లేని డిండి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది.. ‘పాలమూరు’ ఎందుకు పూర్తికాలేదనేది నేతల ప్రశ్నగా మారింది.

ఇప్పుడెందుకు మౌనం?

కాంగ్రెస్‌ కూడా డిండి ప్రాజెక్టును పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో మెజారిటీ దానికి వ్యతిరేకంగా పోరాడినవారే.. అయితే గత ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ద్వారా నీరిచ్చిన తర్వాత ఇక్కడి రైతులు సంతోషంగా ఉన్నప్పుడు డిండి అనుసంధానాన్ని తెరపైకి తెద్దామని, ఆ లోపు మిగతా పనులు పూర్తి చేద్దామనే ఆలోచన చేయగా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు - రంగారెడ్డి పనులు అనుమతులు లేవని ముందుకు సాగకపోగా.. డిండి - ఏదుల లింక్‌కు జీవో జారీ చేసి.. టెండర్లు పూర్తిచేయడంతో పాటు పనులను వేగం చేశారు. దాదాపు 100 మీటర్ల వెడల్పు ఉన్న కాలువలను తవ్వుతున్నారు. కేవలం ఉల్పర దగ్గర బ్యారేజీ కట్టి.. డిండికి మళ్లించడం.. మార్గంమధ్యలో కొంత పెండింగ్‌ పనులను పూర్తిచేయడమే మిగిలింది.. అదే సమయంలో పాలమూరు - రంగారెడ్డి కాలువల భూసేకరణకు గత ప్రభుత్వం జీవోఓ ఇవ్వగా.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అనుమతులు లేవని రద్దు చేసింది. ఇప్పటికే పలుమార్లు సీఎం సమీక్షలు నిర్వహించినా, ‘పాలమూరు’ పనులు ముందుకు సాగడం లేదు. మరీ డిండికి అనుమతులు లేకుండా పనులు ఎలా చేస్తున్నారని పాలమూరు ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏదుల వరకు పనులు పూర్తి చేశారని, అక్కడి నుంచే తరలిస్తే తర్వాత రిజర్వాయర్లకు నీరే రాదని ఆరోపిస్తున్నారు. తమ పాదయాత్రతోనైనా పాలమూరు- రంగారెడ్డి పూర్తికి సీఎం మనసు పెట్టాలని కోరుతున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 11:31 PM