రాయిచూర్‌లో బంద్.. కృష్ణలో ఎఫెక్ట్
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:39 PM
కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని రాయచూర్ జిల్లాలో దళిత, ప్రజా సంఘాలు, బీజేపీ, జేడీఎస్ పార్టీలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.
కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ చేయాలని నిరసన
గుడెబల్లూరు శివారులో జాతీయ రహదారులపై అక్కడి పోలీసులు వాహనాల నిలిపివేత
గంటల తరబడి ఆందోళనతో ప్రయాణికుల ఇక్కట్లు
కృష్ణ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని రాయచూర్ జిల్లాలో దళిత, ప్రజా సంఘాలు, బీజేపీ, జేడీఎస్ పార్టీలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. దాంతో నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని గుడెబల్లూరు గ్రామ శివారులో 167వ, 150వ జాతీయ రహదారులపై టైరోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి స్థానిక పోలీసుల సహాయంతో కర్ణాటక పోలీసులు వాహనాలను నిలిపేయించారు. దాంతో ఇటు టైరోడ్డు నుంచి గుడెబల్లూరు వరకు, అటు టైరోడ్డు నుంచి హిందూపూర్ వరకు వాహనాలు నిలిచాయి. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బస్సులు, లారీలు, టిప్పర్లు, కంటైనర్లు అధికంగా నిలిచిపోయాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని గుల్బర్గా, యాదగిరి, సోలాపూర్, పూణె జిల్లాల నుంచి రాయచూర్ వైపు వెళ్లే ప్రయాణికులు ఆటోల్లో కర్ణాటక వైపు వెళ్లారు. హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్లే బస్సులను కూడా టైరోడ్డు నుంచి పంపించారు. మక్తల్ సీఐ రామ్‌లాల్, స్థానిక ఎస్‌ఐ నవీద్ సిబ్బందితో కలిసి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా బందోబస్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చే కార్లు, ఇతర చిన్న చిన్న వాహనాలను యాదగిరి జిల్లా సైదాపూర్ నుంచి రాయచూర్‌కు మళ్లించారు.
వాహనాల్లోనే వంటలు
రోడ్డుపైనే గంటల తరబడి వాహనా లు నిలిచిపోవడంతో లారీ డ్రైవర్లు వం టలు చేసుకుని తిన్నారు. ప్రయాణికులు హోటల్స్, బేకరీలు, టీస్టాల్‌లకు వెళ్లి భోజనాలు చేయడంతో పాటు స్నాక్స్ తిన్నా రు. దాంతో అవి రద్దీగా మారాయి. కర్ణాటక నుంచి వచ్చిన అంబులెన్స్‌లను, ఒక కారులో పేషెంట్లు రావడంతో టైరోడ్డు నుంచి రాయచూర్‌కు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు వాహనాలను వదిలిపెట్టారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడ్డారు.