Share News

కావాలనే ఖరాబ్‌....!

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:43 PM

రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరించింది. అప్పట్లో మిల్లుల సామర్థ్యం కంటే ఎక్కువ కేటాయింపులు జరిగాయి. తర్వాత వాటికి సీఎంఆర్‌ వద్దని చెప్పి వేలం వేసింది.

కావాలనే ఖరాబ్‌....!
మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం తీగపల్లిలోని కనకదుర్గ మిల్లులో వానకు, ఎండకు పాడైపోతున్న 2022-23 రబీ సీజన్‌ ధాన్యం

- మిల్లుల్లో ఎండకు ఎండి.. వానకు తడుస్తున్న వేలం ధాన్యం

- కాపాడితే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వదిలేస్తున్న మిల్లర్లు

- పాడైన తర్వాత లిక్కర్‌, బీరు, ఇథనాల్‌ పరిశ్రమలకు విక్రయం

- తనిఖీల సందర్భంలోనూ పాడైపోయిందనే ఎత్తుగడతో మోసం

- సైలో బ్యాగుల వ్యవస్థ తీసుకొస్తేనే మిల్లర్ల ఆటలకు అడ్డుకట్ట

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరించింది. అప్పట్లో మిల్లుల సామర్థ్యం కంటే ఎక్కువ కేటాయింపులు జరిగాయి. తర్వాత వాటికి సీఎంఆర్‌ వద్దని చెప్పి వేలం వేసింది. అనంతరం వేలం వేసిన ధాన్యాన్ని మిల్లర్లే ఉంచుకొని ఆ మేరకు డబ్బులు చెల్లించాలని సూచించింది. కొంతమంది మిల్లర్లు డబ్బులు చెల్లిస్తుండగా, కొంతమంది మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం మాత్రం మిల్లర్ల నుంచి బకాయిలు రాబట్టాల్సిందేనని అధికారులను ఆదేశిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్లకు ఆశపడి మిల్లర్లకే వత్తాసు పలుకుతుంటారు. రాజకీయ అండదండలు మెండుగా ఉన్న మిల్లర్లు, యథేచ్ఛగా తమకు నచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా విజిలెన్స్‌ తనిఖీల్లో ఉమ్మడి జిల్లాలో రూ. 100 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు వెల్లడైంది. అన్ని మిల్లులను వరుసగా తనిఖీ చేస్తే మాయమైన ధాన్యం విలువ రూ.వెయ్యి కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. కానీ, నిబంధనల్లో లొసుగులను ఎప్పటికప్పుడు అధికారులు మిల్లర్లకు చెబుతూ వారిని కాపాడుతున్నారు. 2022-23 ధాన్యం బకాయిలు ఇక వసూలు చేయడం దాదాపు కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రైస్‌మిల్లర్లు కొత్త ప్రణాళికలో ఉన్నారు. అది క్షేత్రస్థాయిలో విజిట్‌ చేసినప్పుడు తేటతెల్లమవుతోంది. వేలం వేసిన ధాన్యం మొత్తమే ఇవ్వకుండా దాన్ని కావాలనే కరాబ్‌ చేసే ప్రణాళికకు పూనుకుంటున్నారు. పాడైన ధాన్యానికి డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. బకాయిల చెల్లింపునకు డెడ్‌లైన్‌ విధించకపోతే ఆ పాడైపోయిన ధాన్యం నుంచి కూడా డబ్బులు దండుకునే అవకాశం ఉంది.

సొమ్ము చేసుకునేందుకు ఎత్తుగడ

బ్రోకెన్‌ రైస్‌, పాడైపోయిన ఆహార వ్యర్థాల ద్వారా ఉమ్మడి జిల్లాలో రెండు ఫ్యాక్టరీల్లో ఇథనాల్‌, రెండు పరిశ్రమల్లో లిక్కర్‌ తయారవుతోంది. వీటికి ముడిసరుకు కోసం కచ్చితంగా నూకలు లేదా బ్రోకెన్‌ మొక్కజొన్నలు కావాలి. అవసరానికి తగ్గట్లుగా ఉమ్మడి జిల్లాలో ముడిసరుకు అందుబాటులో లేదు. దీంతో ధాన్యంపై పడ్డారు. గతంలో రీసైకిల్‌ రేషన్‌ బియ్యాన్ని కూడా వాడినట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఇప్పుడు రైస్‌మిల్లర్లు ఈ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకునే ఎత్తుగడలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 444 రైస్‌మిల్లులకు 6.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 2022-23 రబీ సీజన్‌లో కేటాయించారు. ప్రభుత్వం వేలం వేసిన తర్వాత 4.88 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉండాలి. అయితే ప్రభుత్వం వేలం ధాన్యానికి బదులు డబ్బులు చెల్లించాలని ఆదేశిస్తోంది. ఈ ధాన్యానికిగాను రూ. 1,080 కోట్లు రావాల్సి ఉండగా మిల్లర్లు చెల్లించడం లేదు. కొందరు మాత్రమే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంతోకొంత చెల్లిస్తూ వస్తుండగా మెజారిటీ మాత్రం తమకు కేటాయింపుల కంటే ఎక్కువ ధాన్యం కేటాయించారని, తాము అంత డబ్బు చెల్లించలేమని చెబుతున్నారు. ప్రభుత్వ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు అన్ని మిల్లుల్లో 50 శాతం నిల్వలను మిల్లర్లు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. పూర్తిస్థాయిలో రికవరీ చేసే అవకాశం లేదు. కాబట్టి కేటాయించిన ధాన్యానికి బదులు డబ్బులు అడుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు.

మిగిలిన ధాన్యమూ పక్కదారి

2022-23 రబీ సీజన్‌లో కేటాయించిన ధాన్యం కంటే 50 శాతం తక్కువ నిల్వలు ఉండటంతో ప్రభుత్వం ఆ విలువకు సమానంగా డబ్బులను జమ చేయమంటున్న విషయం తెలిసిందే. వాటిని చెల్లించడానికి మొండికేస్తున్న మిల్లర్లు ఉన్న ధాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. కనీసం మిల్లుల వద్ద ఆరుబయట నిల్వ చేసిన ధాన్యం బస్తాలపై కనీసం టర్ఫాలిన్లు కూడా కప్పి ఉంచడం లేదు. దీంతో ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పూర్తిగా పాడైపోతోంది. కావాలనే వాటిని కరాబ్‌ చేసి ధాన్యం తామూ వినియోగించుకోలేదు కాబట్టి ఆ మేరకు డబ్బులు చెల్లించడం కుదరదనే విధానం అవలంభించాలనే ఎత్తుగడ వేస్తున్నాయి. ఇటీవల నవాబుపేట మండలం తీగలపల్లిలోని శ్రీ కనకదుర్గ పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లులో, హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌లోని శ్రీ లక్ష్మీబాలాజీ రైస్‌మిల్లు, మహ్మదాబాద్‌, కొత్తకోట, పెద్దమందడి మండలాల్లోని మిల్లుల్లోనూ ఈ ధాన్యం పాడుచేయడం స్పష్టంగా కనిపిస్తోంది. అలా పాడైపోయిన ధాన్యానికి బకాయిలు ఎగ్గొట్టడంతో పాటు దాన్ని ఇథనాల్‌, లిక్కర్‌ ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకోనున్నారు. అధికారులు మాత్రం ధాన్యం పాడైపోవడం, టార్ఫాలిన్లు కప్పకపోవడం, అక్రమంగా అమ్ముకోవడం చూసినా అమ్యామ్యాలకు అలవాటుపడి మిన్నకుండిపోతారు.

Updated Date - Aug 19 , 2026 | 11:43 PM