Share News

నకిలీ పంచలోహ విగ్రహం విక్రయానికి యత్నం

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:32 PM

నకిలీ పంచలోహ విగ్రహం, మహిమలు ఉన్నాయని ఓ రాయిని అధిక ధరకు విక్రయించడానికి యత్నించిన ముఠా సభ్యులు ఆరుగురిని జూబ్లీహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌, మైలార్‌దేవుపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నకిలీ పంచలోహ విగ్రహం విక్రయానికి యత్నం
పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితులు, స్వాధీనం చేసుకున్న నకిలీ పంచలోహ విగ్రహం

- ఆగురురి అరెస్ట్‌

రాజేంద్రనగర్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నకిలీ పంచలోహ విగ్రహం, మహిమలు ఉన్నాయని ఓ రాయిని అధిక ధరకు విక్రయించడానికి యత్నించిన ముఠా సభ్యులు ఆరుగురిని జూబ్లీహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌, మైలార్‌దేవుపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ ఆదివారం వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట్‌కు చెందిన కేతావత్‌ రాజు అలియాస్‌ కట్టప్ప, మైలార్‌దేవుపల్లికి చెందిన పి. నర్సింహ, పడత్యకుమార్‌, ప్రవీణ్‌ సింగ్‌, మంగలి బసవ నరేశ్‌, వేములవాడకు చెందిన సిద్ధాంతి చల్లా రవి ముఠాగా ఏర్పడ్డారు. 2024లో పి.నర్సింహ వేములవాడకు చెందిన చల్లా రవి, కొండపల్లి భిక్షపతి వద్ద నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ. 10 లక్షలకు కొనుగోలు చేసి మోసపోయాడు. ఆ విగ్రహాన్ని పడత్యకుమార్‌కు అందజేశాడు. నకిలీ విగ్రహానికి దివ్య శక్తులు ఉన్నాయని, అదృష్టం తీసుకొస్తుందని నమ్మించి అధిక ధరకు విక్రయించాలని వారంతా పథకం వేశారు. కేతావత్‌ రాజు తన వద్ద అరుదైన గులాబీ రంగు రాయి ఉందని, దాన్ని కూడా అధిక ధరకు విక్రయించవచ్చని భావించి ముఠాలో చేరాడు. శనివారం కాటేదాన్‌ లక్ష్మీగూడ సమీపంలో నకిలీ విగ్రహం, రాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌, మైలార్‌దేవుపల్లి పోలీసులు దాడిచేసి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, గులాబీ రంగురాయి, కారు, ఐదు సెల్‌ఫోన్‌లు, మూడు రసాయన ద్రావణాల బాటిళ్లు, రెండు ఎరుపురంగు తువాళ్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును మైలార్‌దేవుపల్లి పోలీసులకు అప్పగించారు.

Updated Date - Aug 16 , 2026 | 11:32 PM