Share News

బీఎల్‌వోల వద్దే..!

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:46 PM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైద రాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

బీఎల్‌వోల వద్దే..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు నమోదు కోసం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- పేరుకుపోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్‌రోల్‌మెంట్‌ ఫారాలు

- స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో బిజీగానే బీఎల్‌వోలు

- నవంబరు 6 వరకే దరఖాస్తుకు అవకాశం.. 25న ముసాయిదా విడుదల

- గత ఎన్నికల కంటే చాలా తక్కువగా ఓటు నమోదు చేసుకున్న పరిస్థితి

- పత్రాలు తీసుకొని తమ వద్దకు రావాలంటూ దరఖాస్తుదారులకు ఫోన్లు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైద రాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఎలక్ర్టోరల్‌ రోల్‌ కోసం ఇప్పటికే షె డ్యూల్‌ విడుదల చేసింది. గత నెల 28న ఈ ప్ర క్రియ ప్రారంభం కాగా.. నవంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులను తీసుకునే అవకాశం ఉండగా.. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లోనే స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయి తే గత ఎన్నికల కంటే చాలా తక్కువ మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటుండగా.. తాజాగా రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. తొందరగా ఓటు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దరఖాస్తులను పరిశీలిస్తే.. అన్నీ 90 శాతం బీఎల్‌వోల వద్దనే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. 5 శాతం ఈఆర్‌వోల వద్ద, 5 శాతం ఏఈఆర్‌వోల వద్ద పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇప్పటికే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ తలనొప్పులతో ఇబ్బందులు పడుతున్న బీఎల్‌వోలకు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఓటర్‌ వెరిఫికేషన్‌ బాధ్యతలు అదనంగా చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే చేసుకున్న దరఖాస్తులు 90 శాతం పెడింగ్‌లో ఉంటున్నాయి. నవంబరు 6వ తేదీన చివరి గడువు ఉండగా.. గతంలో కంటే తక్కువ ఎన్‌రోల్‌మెంట్‌ జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోం ది. ప్రధానంగా ఎన్నికల విధుల్లో ఉండాల్సిన వారంతా ఎస్‌ఐఆర్‌ విధుల్లో ఉండటంతోనే సమస్య గా మారినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవడం మినహా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో అధికారులు దరఖాస్తులు సేకరించడం, స్వీకరించడం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కే వలం 172 దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్‌లో స్వీకరించారు. ఇప్పటివరకు 80,903 దరఖాస్తులు స్వీకరించగా.. అందులో ఆఫ్‌లైన్‌ కొద్ది మొత్తం మాత్రమే కావడం గమనార్హం. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కూడా భారీగా చేసేవారు.. పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు స్వయంగా వెళ్లి ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులను నింపి.. సంబంధిత ఈఆర్‌వోలకు అప్పగించేవారు. కానీ ఇప్పుడు అంతా స్తబ్దత నె లకొంది. దరఖాస్తులన్నీ బీఎల్‌ఓల వద్ద పెండింగ్‌లో ఉండగా.. నవంబర్‌ 25 ముసాయిదా జాబితా విడుదల చేసే సమయానికి ఆమోదించడమో.. తిరస్కరించడమో చేయాల్సి ఉంది.

గత ఎన్నికల్లో 1.12 లక్షల ఓట్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ఎన్నికల్లో 1.12 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. కానీ ఈ ఆరేళ్లలో గ్రాడ్యుయేట్‌ అయిన ఓటర్లతో కలిపి సంఖ్య పెరగాల్సి ఉండగా.. క్రితం ఎన్నికల నాటి సంఖ్యకు తగ్గట్లుగా కూడా ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తికాలేదు. నవంబర్‌ 6 అంటే దాదాపు 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోనే గత ఎన్నికల్లో కంటే మించి ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తి కావాల్సి ఉంది. ఇన్నాళ్లుగా పార్టీలు పట్టించుకోకపోవడంతో కొంత స్తబ్దుగా ప్రక్రియ సాగగా.. నమోదు ప్రక్రియను బీఆర్‌ఎస్‌ సీరియస్‌గా తీసుకుంది. సోమ వారం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో అవగాహన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఫోకస్‌ పెట్టగా.. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ దరఖాస్తులను నమోదు చేయించడంలో మాత్రం విఫలంగానే ఉంది. గతంలో ప్రత్యేక కౌంటర్లు పెట్టి మరీ ఎన్‌రోల్‌మెంట్‌ చేసిన పార్టీలు ఈసారి ఎందుకు నిర్లిప్తంగా ఉన్నాయనేది తెలియడం లేదు. అక్టోబర్‌ 26 నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం 80,903 దరఖాస్తులు మాత్రమే రాగా.. అందులో మెజారిటీ స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నవే కావడం గమనా ర్హం. అయితే పార్టీలు ఓటు నమోదు చేయించడం ప్రారంభిస్తే కొన్ని సంఘాలు తాయిలాలు అడుగుతాయనే భయం కూడా నాయకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ఎన్నికల కంటే అత్యంత తక్కువగా వన పర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓట్ల నమోదు అయ్యిందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో 35,510 మంది ఓటర్లు ఎన్‌రోల్‌ చేసుకుంటే ప్రస్తుతం 23,308 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో గతంలో 23,374 మంది ఎన్‌రోల్‌ చేసుకుంటే ప్రస్తుతం 14,449 మంది మాత్రమే ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 80,903 దరఖాస్తులు చేసుకుంటే కేవలం 3,943 మాత్రమే ఆమోదించగా.. 122 దరఖాస్తులను తిరస్కరించారు. బీఎల్‌ఓల వద్ద అత్యధికంగా 64,782 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 5,735 దరఖాస్తులు ఏఈఆర్‌ ఓల వద్ద, 2,228 దరఖాస్తులు ఈఆర్‌వోల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

తమ వద్దకే రావాలని...

సాధారణంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో ఓటుహక్కు కోసం నమోదు చేసుకుంటే ఆయా బూత్‌లకు చెందిన బీఎల్‌వోలు దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి పరిశీలించి.. ఆమోదించడమో.. తిరస్కరించడమో చేస్తారు. కానీ ఈసారి భిన్నమైన సరళిని అవలింభిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా బీఎల్‌వోలు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా దరఖాస్తుదారులకు ఫోన్‌ చేసి.. పత్రాలు తీసుకుని ఫలానా చోటుకు రావాలని సూచిస్తున్నారు. ఎక్కడో ఉద్యోగం చేస్తున్నవారు.. స్థానికంగా అందుబాటులో ఉండని వారు కూడా దరఖాస్తు చేసుకుంటారు.. వారు రావడం ఆలస్యమవుతుండటంతో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇప్పటివరకు చేసిన దరఖాస్తుల్లో కేవలం 3,943 మాత్రమే ఆమోదించారంటే.. అందుకు బీఎల్‌వోలు ఇంటివద్దకు వెళ్లి పరిశీలన చేయకుండా తమ వద్దకు రావాలని కోరడమే కారణమని స్పష్టమవుతోంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో కూడా తమ వద్దకు వచ్చి ఓటు నిరూపించుకోవాలనే విషయం దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే.. కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా ఆ నిబంధనను తొలగించి.. నోటీసులు వచ్చి న వారి ఇంటి వద్దకే బీఎల్‌వోలు వచ్చి.. పత్రాలు పరిశీలించిన తర్వాత ఓటు ఉంచడమో తీసేయ డమో చేస్తారని సవరణలు జారీ చేసింది. అలాగే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రారంభంలో కూడా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లకుండా కేవలం ఏదో ఒకచోట కూర్చుని ఓటర్లను రమ్మనడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు స్పందించి.. ప్రక్రియలో బీఎల్‌వోలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేస్తే నమోదు, ఆమోదం ప్రక్రియ వేగంగా జరుగుతాయనే భావన వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 27 , 2026 | 11:46 PM