Share News

ఢోకా లేనట్లే..

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:39 PM

జూరాల నెట్టెంపాడు కింద పంటల సాగు ఆశాజనకంగా సాగుతున్నది.

  ఢోకా లేనట్లే..
జూరాల ప్రాజెక్టు

- కర్ణాటక రీజనరేట్‌ వాటర్‌ 5 టీఎంసీలు

- మరో 1.5టీఎంసీలు వచ్చే అవకాశం

- ఏప్రిల్‌ 15వరకు సాగునీరిచ్చే యత్నం

గద్వాల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): జూరాల నెట్టెంపాడు కింద పంటల సాగు ఆశాజనకంగా సాగుతున్నది. ప్రతీ ఏడాది యాసంగిలో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడేవి. ఈ ఏడాది కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు కింద సాగు చేశారు. దీంతో కర్ణాటక సీఫేజ్‌ వాటర్‌(రీజనరేట్‌) 12రోజులకోసారి భారీగానే జూరాలకు వచ్చి చేరుతున్నది. గత ఏడాది యాసంగిలో జూరాల ప్రాజెక్టు కింద భారీగా సాగు చేశారు. కర్ణాటక నుంచి వస్తుందని అంచనా వేసిన సీఫేజ్‌ వాటర్‌ రాలేదు. దీంతో పంటలు కాపాడేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఒకవైపు తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూనే పంటలను కాపాడే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాగునీటి పేరుతో కర్ణాటకతో చర్చలు చేసింది. 2టీఎంసీలు ఇస్తామని చెప్పినా జూరాలకు వచ్చేసరికి 1.5టీఎంసీలు కూడా చేరలేదు. పంట చివర్లో నీటి విడుదలలో ఇబ్బందులు ఏర్పడి కాలువల చివరి ఆయకట్టు రైతుల పంటలు ఎండిపోయాయి. రైతులు ధర్నాలు చేశారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. అధికారులు జాగ్రత్త పడి జూరాల కింద 26,923 ఎకరాలకే సాగునీరు అందిస్తామని కరాకండిగా వారబందీ చేయడంతో రైతులు కూడా ఆ మేరకు సాగు చేశారు.

ఇప్పటి వరకు 5 టీఎంసీలు రాక

నారాయణపూర్‌ ప్రాజెక్టు కింద సాగు జరగడంతో సీఫేజ్‌ వాటర్‌ రూపంలో జూరాలకు ఇప్పటి వరకు 5టీఎంసీలు వచ్చాయి. గత డిసెంబరులో 1.5టీఎంసీలు,జనవరిలో 2.4టీఎంసీలు, ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 1.2టీఎంసీ సీఫేజ్‌ వాటర్‌ జూరాలకు వచ్చి చేరింది. నారాయణపూర్‌ ప్రాజెక్టు కింద ఇంకా రెండు తడులకు సాగునీటిని విడుదల చేస్తున్నారో మరో 1.5టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అదికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు కూడా వచ్చే నీటిని, విడుదల చేస్తున్న నీటిని అంచనా వేస్తూ ప్రాజెక్టులోని నీటి నిల్వలు కాపాడుతూ వస్తున్నారు. ఏప్రిల్‌ 15వరకు సాగునీటిని అందించి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

జూరాల, నెట్టెంపాడు కింద గట్టెక్కినట్లే...!

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వల సామర్థ్యం తగ్గిపోవడంతో ప్రతీ ఏడాది యాసంగిలో సాగుకు ఇబ్బందులు తప్పడం లేదు. గత ఏడాది ఎక్కువ సాగుకు అనుమతులు ఇవ్వడంతో పంటలను కాపాడేందుకు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది జారాల కింద 26,924ఎకరాలకు మాత్రమే సాగుకు అనుమతులు ఇచ్చారు. ఆత్మకూర్‌ వైపు రామన్‌పాడు డ్యామ్‌ వరకు 11,924ఎకరాలకు, గద్వాల వైపు 15వేల ఎకరాలు అంటే డీ-31 వరకు సాగునీరు ఇచ్చారు. దీనిని కూడా వారబందీ పద్ధతిలో మూడు రోజులు విడుదల, నాలుగు రోజులు కాలువలు బంద్‌ పెట్టి ఇచ్చారు. నెట్టెంపాడు కింద 22,800ఎకరాల ఆయకట్టుకు అనుమతిచ్చారు. ఇందులో గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ కింద 4,800ఎకరాలు, ర్యాలంపాడు రిజర్వాయర్‌ కింద 15వేలు, ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌ కింద 3వేల ఎకరాలకు అనుమతిచ్చారు. డిసెంబరులో కర్ణాటక సీఫేజ్‌ వాటర్‌ వచ్చి జూరాల ఫుల్‌ లెవల్‌ అయినపుడు దిగువకు విడుదల చేయకుండా నెట్టెంపాడు మోటార్లను ఆన్‌ చేసి ఎత్తిపోశారు. ఇలా అన్ని విధాలుగా అధికారులు నీటి నిల్వలను సద్వినియోగం చేస్తూ వస్తుండటంతో ఈ ఏడాది రెండు ప్రాజెక్టుల కింద పంటలు గట్టెక్కే అవకాశం ఉంది.

రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తేనే...

జూరాల, నెట్టెంపాడు కింద సాగుచేసిన రైతులు నీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటేనే పంటలు గట్టెక్కుతాయి. ఇప్పటి వరకు కర్ణాటక నుంచి సీఫేజ్‌ వాటర్‌ వచ్చింది. ఇక నుంచి వచ్చే అవకాశం లేదు. జూరాలలో 6.69 టీఎంసీలు ఉన్నా వినియోగించే నీళ్లు మాత్రం 3టీఎంసీల వరకే ఉన్నాయి. ఏప్రిల్‌ 15వరకు సాగునీరు అందించాలంటే రైతులు నీటిని వృథా చేయకుండా మడిగట్టులకు మూతలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాలువలు తెరిచి ఇళ్లకు వస్తే నీళ్లు వృథాగా కృష్ణానదిలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. రైతులు కూడా అధికారుల సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది.

ఏప్రిల్‌ 15వరకు నీళ్లిస్తే పంటలు పండినట్లే

యాసంగిలో అధికారులను నమ్మి వరిని సాగు చేశాము. ఇప్పటి వరకు వారబందీ పద్ధతిలో సాగునీరు ఇచ్చారు. ఎక్కడా తడులకు ఇబ్బందులు లేకుండా రైతులం పారించుకుంటున్నాం. ఇదే పద్ధతిలో ఏప్రిల్‌ 15వరకు సాగునీరు ఇస్తే పంటలు పండుతాయి. గత ఏడాది ఒకటి, రెండు తడులు ఇబ్బంది అయ్యింది. ఈ ఏడాది అది జరగకుండా అధికారులు పంటలను కాపాడాలి.

- వెంకట్రామిరెడ్డి, రైతు లత్తిపురం గ్రామం, గద్వాల మండలం(73జీడీయల్‌20)

Updated Date - Feb 20 , 2026 | 11:39 PM