అపర భద్రాద్రి శిర్సనగండ్ల
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:28 PM
నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలంలోని శిర్సనగండ్ల క్షేత్రం అపర భద్రాద్రిగా ప్రఖ్యాతి పొందింది.
- ఏకశిలపై వెలసిన సీతారామచంద్రస్వామి దేవాలయం
- కోరమీసాల రాముడిగా భక్తులకు దర్శనం
- ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణోత్సవం
- ఈనెల 26 నుంచి ఏప్రిల్ 7 వరకు బ్రహ్మోత్సవాలు
చారకొండ, మార్చి 24 (ఆంఽద్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలంలోని శిర్సనగండ్ల క్షేత్రం అపర భద్రాద్రిగా ప్రఖ్యాతి పొందింది. ఇక్కడ కొలువైన స్వామి అభయ రాముడిగా, రాజ రాముడిగా, కోరమీసాల రాముడిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో ఈ నెల 26 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయ ఫౌండరీ, ట్రస్ట్ చైర్మన్ ఢేరం రామశర్మ, ఈవో స్వర్గం ఆంజనేయులు ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చారకొండ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో, శిర్సనగండ్ల గ్రామ పంచాయతీలోని అయోధ్యనగర్ (గుట్టపైన)లో దాదాపు 60 ఎకరాల్లో ఈ క్షేత్రం విస్తరించి ఉంది. ఇక్కడ 300 అడుగుల ఎతైన ఏకశిలపై, దత్తాత్రేయ స్వామి చేతుల మీదుగా 14వ శతాబ్దంలో ఈ పుణ్యక్షేత్రం ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. భద్రాచలం మాదిరిగానే ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా..
ఈనెల 26వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఆలయ ప్రదక్షిణ, మహాగణపతిపూజ, గోపూజ, అభిషేకం, ధ్వజారోహణం ఉంటాయి. ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారం ఆలయం నుంచి పోచమ్మకు సారే సమర్పిస్తారు. అనంతరం శిర్సనగండ్ల నుంచి గుట్టపైకి స్వామి వారిని తీసుకువడం, రాములవారి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మాసకల్యాణం, రాత్రి ఎదురుకోళ్లు, అశ్వసేవ ఉంటాయి. 27న ఉదయం అభిషేకం, అర్చనలు, వేదపారయణం, మధ్యాహ్నం స్వామివారి కల్యాణం, హనుమత్‌సేవ, అఖండ భజన ఉంటాయి. 28న చిన్నరథం (పూలతేరు) 29న శివదత్తాత్రేయ, పరశురాముడు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, గరుడసేవ ఉంటాయి. 30న పెద్దరథం, బ్రహ్మోత్సవం, చంద్రప్రభ వాహన సేవ, 31 సూర్యవాహన సేవ, నాగబలి, రాత్రి గజసేవ దోపోత్సవం నిర్వహిస్తారు. వచ్చేనెల 1వ తేదీన రాత్రి పల్లకీసేవ, ఏకాంతసేవ, చక్రతీర్థం, 2న గుట్టపై హనుమత్ విజయోత్సవం ఉంటాయి. 7న సాయంత్రం 5 గంటలకు గుట్టపై నుంచి స్వామి వారు ఊరేగింపుగా శిర్సనగండ్ల గ్రామానికి వెళ్లడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.