Share News

ఆత్రుత.. కొరత

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:27 PM

వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా యూరియా సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా సరఫరాలో లోపం, దేశీయ ఉత్పత్తి సరిపోయేంత జరుగకపోవడం వంటి కారణాలతో రాష్ర్టానికి సరైన సమయంలో రాలేదు.

ఆత్రుత.. కొరత
వనపర్తి జిల్లా గోపాల్‌పేట సింగిల్‌ విండో తెరువక ముందే మంగళవారం కార్యాలయం ముందు పాసుపుస్తకాలు వరుసలో పెట్టి ఎదురుచూస్తున్న రైతులు

ఉమ్మడి పాలమూరులో యూరియా కోసం పలుచోట్ల పడిగాపులు

ముందు ముందు యూరియా దొరకదనే ఆందోళనే కారణం

ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇచ్చేలా సీలింగ్‌

పైవేటు దుకాణాల్లో యూరియా కావాలంటే ఇతర ఎరువుల లంకె..

మహబూబ్‌నగర్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా యూరియా సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా సరఫరాలో లోపం, దేశీయ ఉత్పత్తి సరిపోయేంత జరుగకపోవడం వంటి కారణాలతో రాష్ర్టానికి సరైన సమయంలో రాలేదు. దీంతో పాటు రైతుల్లో నెలకొన్న ఆందోళన, కొన్నిచోట్ల పక్క రాష్ర్టాలకు అక్రమంగా తరలింపుతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాగోలా ఆ సీజన్‌ను గట్టెక్కించిన రైతులు ఇప్పుడు యాసంగి సీజన్‌ యూరియా కోసం ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో రోజుకో చోట యూరియా కోసం నిరసనలు జరుగుతున్నాయి. వేకువజామునే ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద రైతు వేదికల వద్ద బారులు తీరుతున్నారు. పాసుపుస్తకాలను లైన్లలో పెట్టి ఎదురుచూస్తున్నారు. గతంలో స్టాక్‌ తక్కువగా ఉన్నా ఇంత ఒత్తిడి ఉండేది కా దని, ఇప్పుడు ఎప్పటికప్పు డు స్టాక్‌ వస్తున్నా రైతులు భారీ సంఖ్యలో వస్తుండటం వల్ల ఇబ్బంది అవుతుందని వ్యవసాయ అధికారులు చె బుతున్నారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట, నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి, తెలకపల్లి మండలాల్లో ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. వానాకాలం సీజన్‌లో పంటలు ఎక్కువగా సాగు కావడంతో కావాల్సినంత యూరియా సరైన సమయానికి సరఫరా కాలేదు. అయితే యాసంగి సీజన్‌లో ఇంకా నాట్లు కొనసాగుతున్నాయి. నాట్లు వేసే సమయంలో ఒకసారి, మళ్లీ కలుపుతీత సమయంలో మరోసారి రైతులు సాధారణంగా యూరియా వాడతారు. కానీ, రెండింటికి కలిపి ఇప్పుడే స్టాక్‌ చేసుకోవాలని అనుకోవడంతోనే సమస్య ఎదురవుతోంది.

ఆందోళనతోనే పడిగాపులు

వానాకాలం సీజన్‌లో యూరియా సంక్షోభం పీడ రైతులను వీడటం లేదు. ఆ ఆందోళనతోనే ప్రస్తుతం విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అవసరాన్ని బట్టి స్టాక్‌ నిల్వ చేస్తున్నప్పటికీ ముందస్తుగా చాలామంది రైతులు కొనుగోలు చేసి స్టోర్‌ చేసుకుంటుండటంతో తర్వాత వచ్చే రైతులకు సరైన సమయంలో యూరియా దొరకడం లేదు. అలాగే మౌఖిక ప్రచారం కూడా రైతులు బారులు తీరడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. తెలంగాణలో రబీ సీజన్‌లో దాదాపు 15 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు రైతులు ప్రస్తుతం ఎరువులను ఉపయోగిస్తున్నారు. ఇందులో 10 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు యూరియా వాటానే ఉన్నది. ప్రస్తుతం ఫిబ్రవరి రెండో వారం వరకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్నదని ఆయా జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అవసరాలకు అనుగుణంగా యూరియా తీసుకెళ్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, ప్రస్తుత అవసరాలు కాదని, ఈ సీజన్‌ మొత్తానికి కావాల్సిన యూరియాను ఒకేసారి కొనుగోలు చేసి తీసుకెళుతుండటం పలుచోట్ల కొరతకు కారణమవుతుందని స్పష్టమవుతోంది. కొందరు రైతులు ఈసారి వానాకాలం పంటలు కోతకు వచ్చిన వెంటనే ఎరువులు స్టాక్‌ చేసుకోవడం ప్రారంభించారు. సీజన్‌ తీవ్రమయ్యాక అయితే కొరత ఏర్పడుతుందని ఆ విధంగా చేస్తుండటంతో చిన్న, సన్నకారు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసేవారు కూడా అవసరానికి అనుగుణంగా తీసుకోకుండా ఎక్కువ స్టాక్‌ కోసం మళ్లీ మళ్లీ వస్తుండటం కూడా సమస్యకు కారణమవుతుందని తెలుస్తోంది.

కొనసాగుతున్న సీలింగ్‌..

వానాకాలం సీజన్‌లో యూరియా కొరత ఏర్పడటంతో ఒక్కో రైతుకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున సీలింగ్‌ విధించారు. దీనివల్ల అవసరానికి తగ్గట్లుగా కొనుగోలు చేస్తారని భావించారు. యాసంగి సీజన్‌లో కూడా అదే విధానం అమలు చేస్తున్నప్పటికీ యూరియా తీసుకున్న రైతులే మళ్లీ మళ్లీ వచ్చి తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. ఇక ప్రైవేటులోనైనా కొనుగోలు చేద్దామంటే సదరు డీలర్లు తమ వద్ద నిత్యం ఖాతా ఉన్నవారికి స్టాక్‌ వచ్చినప్పుడు చెప్పి విక్రయిస్తుండగా ఇతర రైతులకు గులికలు, ఫెస్టిసైడ్స్‌ కొనుగోలు చేస్తేనే యూరియా బస్తాలు ఇస్తామంటూ లంకె పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి యూరియా విక్రయాల్లో పారదర్శకత కోసం ఫెర్టిలైజర్స్‌ పేరుతో బుకింగ్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ఇందులో రైతు తమ ఆధార్‌ కార్డు, భూమి పాసుబుక్కు వివరాలు నమోదు చేస్తే రిజిస్టర్‌ మొబైల్‌ నెంబరుకు మెసేజ్‌ వెళ్తుంది. 24 గంటల్లోపు బుకింగ్‌ చేసుకున్న ప్రకారం ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని జిల్లాల్లో రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఈసారి ఫైలెట్‌ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాలను ఎంపిక చేయగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో కూడా ఈ యాప్‌ ద్వారా బుకింగ్‌ కొనసాగుతోంది. దీనివల్ల రైతు తమ మండలంలోనే కాకుండా యూరియా స్టాక్‌ ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి యూరియా తీసుకోగలుగుతున్నారు. బుక్‌ చేసుకున్నప్పుడు స్టాక్‌ వివరాలు కూడా చూపెడుతుండటంతో ఇబ్బందులు ఉండటం లేదని రైతులు చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో ఈ యాప్‌ ద్వారా బుకింగ్‌ ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

యూరియా దొరకడం లేదు

నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. అందులో మొక్కజొన్న, వరి సాగుచేశాను. మొక్కజొన్నకు ప్రస్తుతం కలుపు సమయం అయ్యింది. ఇప్పుడు ఎరువులు వేయాలి. అలాగే వరికి కూడా ఎరువుల అవసరం ఉంది. యూరియా కోసం మండల కేంద్రానికి వస్తే చాలామంది బారులు తీరారు. ఉదయం నాలుగు గంటలకే వచ్చి లైనులో ఉన్నారు. ప్రతీ సీజన్‌లో యూరియా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించాలి.

- నునావత్‌ నూని, పొలికెపాడు, వనపర్తి జిల్లా

సరిపడా ఎరువుల సరఫరాల లేదు

రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన సాగు విస్తీర్ణానికి సరిపడా ఎరువులు సరఫరా చేపట్టకపోవడంతో యూరియా కోసం అవస్థలు పడుతున్నాం. పంట పొలాలను విడిచి రోజుల తరబడి ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నా లభించడం లేదు. సకాలంలో ఎరువులు చల్లితేనే సాగు చేసిన పంటలు చేతికి అందుతాయి. లేదంటే పెట్టిన పెట్టుబడి మట్టిపాలవుతుంది. ప్రబుత్వం అవరానికి అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలి.

- బాలస్వామి, రైతు, ఖానాపూర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా

Updated Date - Jan 28 , 2026 | 11:27 PM