వలస ఓటర్లలో గుబులు
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:38 PM
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రారంభం కానున్నది.
- సొంత ప్రాంతాల్లో నమోదు చేసుకోవాలంటున్న నాయకులు
- ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ఇక్కడ సమర్పిస్తేనే మేలు
- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో కూడా ‘సర్’ టెన్షన్
- గార్డియన్ సంరక్షణలో పెరిగిన వారి పరిస్థితిపై ఆందోళన
ఆంధ్రజ్యోతి, మహబూబ్‌నగర్ ప్రతినిధి : నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఓటర్ల జాబితాలో డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, అనర్హుల ఓట్లు తొలగించడం కోసం ఉద్దేశించిన ఈ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కొరవడింది. భూత్ లెవల్ అధికారుల నిబద్ధత పైనే మొత్తం ప్రక్రియ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ముందుగా బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్నారు. ఓటర్లు వాటిలో వివరాలను పూరించిన తర్వాత బీఎల్‌వోలు సేకరిస్తారు. మొదట ముసాయిదా జాబితా, తర్వాత తుది జాబితాలో ప్రచురిస్తారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధానంగా వలసలకు కేరాఫ్ అడ్రస్.. ఇక్కడి ప్రజలు ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, పూణె, భీవండి, సూరత్ వరకు వెళ్లి పనులు చేసుకుంటారు. కొందరు శాశ్వత ప్రాతిపదికన అక్కడ ఉంటున్నప్పటికీ.. సొంత ఊరిలో పొలం ఉండటమో లేదా బంధువులు, ఇల్లు ఉండటంతో ఇక్కడి ఓటర్లుగానే కొనసాగుతున్నారు. కొందరికి ఆయా రాష్ర్టాలతో పాటు ఊర్లలో కూడా ఓట్లు ఉన్నాయి. ఒకే రాష్ట్రంలో ఉన్న డబుల్ ఓట్లను తొలగించే అవకాశం ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇక్కడి వలస కూలీల ఓటర్లను తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. వలస ఓటర్లకు రేషన్ కార్డు, ఓటర్ కార్డు రూపంలో పుట్టిన ఊరితో సంబంధాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఆ ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. అక్కడ సెటిల్ అయిన వారు కేవలం ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఇక్కడికి వచ్చి ఫారాలను సమర్పించే అవకాశం లేదు. దీంతో వారంతా అనర్హులుగా మారుతారనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే వలస ఓటర్లను ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. ఇతర రాష్ట్రాలకు అభ్యర్థులు వెళ్లి ప్రచారం చేసేంత ఓటు బ్యాంకు వారికి ఉంది. ఈ నేపథ్యంలో వారందరినీ ఇక్కడే ఎన్యూమరేషన్ ఫారం పూరించి ఇవ్వాలని పార్టీలు సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో ఈఎఫ్‌లు పూరించి ఇస్తే తర్వాత ఫామ్-8 ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవడం ఇబ్బందవుతుందని చెబుతున్నారు.
వలస వచ్చిన వారిలోనూ...
ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారే కాకుండా, ఇతర రాష్ట్రల నుంచి వలస వచ్చిన వారు కూడా తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు కూడా ఎస్‌ఐఆర్-2002 జాబితాలో వారి సంబంధీకుల పేర్లు ఉండవు కాబట్టి ఎలా నిరూపించుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. తల్లిదండ్రులు జీవించి ఉన్నవారికి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, మరణించిన వారి విషయంలో కొంత అయోమయం ఏర్పడుతోంది. గార్డియన్ సంరక్షణలో పెరిగిన వారు తమ తల్లిదండ్రుల పేర్లుగా ఎవరివి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. గార్డియన్‌గా ఉన్నవారి పేర్లు ఎస్‌ఐఆర్ 2002లో లేకుంటే ఏం చేయాలనే విషయంలో కూడా కొంత సందిగ్ధం ఉంది. అలాగే 2002 తర్వాత వివాహం చేసుకుని అత్తవారింటికి వచ్చిన వారు ఇప్పుడు ఎస్‌ఐఆర్‌లో తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలా? లేక అత్తమామలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలా? అనే విషయంపై కూడా కొంత అయోమయం ఉంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో 7,27,768 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 2,35,275 మంది అనామలీస్‌గా ఫ్లాగ్ చేశారు. గద్వాల జిల్లాలో 5,04,002 మంది ఓటర్లు ఉంటే, 79.12 శాతం మ్యాపింగ్ పూర్తయ్యి.. 1,54,460 మందిని అనామలీస్ జాబితాలో చేర్చారు. వనపర్తి జిల్లాలో 2,75,570 మంది ఓటర్లు ఉంటే, 82 శాతం మ్యాపింగ్ పూర్తి చేసి.. 97,387 మందిని అనామలీస్‌గా గుర్తించారు. నారాయణపేట జిల్లాలో 4,95,574 మంది ఓటర్లు ఉండగా, 84.59 శాతం మ్యాపింగ్ పూర్తయ్యింది. 1,86,544 మందిని అనామలీస్‌గా పరిగణిస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 6,87,595 మంది ఓటర్లు ఉండగా, 76 శాతం మ్యాపింగ్ పూర్తి చేశారు. 2,13,154 మందిని అనామలీస్ జాబితాలో చేర్చారు. వీరందరూ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన తర్వాత సందేహాలు ఉంటే నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత ఈఆర్‌ఓ వద్ద సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.