Share News

కాలికి బలపం కట్టుకున్నట్లు

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:11 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ ముఖ్యుల వరుస పర్యటనలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. సొంత జిల్లా కావడంతో ఉమ్మడి రాష్ట్రం, స్వరాష్ట్రంలో ఏ సీఎంకు సాధ్యం కానన్ని సార్లు రేవంత్‌రెడ్డి పాలమూరులో పర్యటించారు.

కాలికి బలపం కట్టుకున్నట్లు
అమర్‌రాజా గిగా కారిడార్‌లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీజీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ కె.శశాంక

ఉమ్మడి పాలమూరులో సీఎం, మంత్రుల విస్తృత పర్యటనలు

నెలన్నర వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రావడం మూడోసారి

మొన్న కోమటిరెడ్డి, నిన్న మల్లు భట్టి విక్రమార్క, నేడు సీఎం

ముఖ్య నేతల పర్యటనలపై రాజకీయ వర్గాల్లో చర్చ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ ముఖ్యుల వరుస పర్యటనలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. సొంత జిల్లా కావడంతో ఉమ్మడి రాష్ట్రం, స్వరాష్ట్రంలో ఏ సీఎంకు సాధ్యం కానన్ని సార్లు రేవంత్‌రెడ్డి పాలమూరులో పర్యటించారు. ఒక్క ఎంపీ ఎన్నికల వరకే 12 సార్లు పర్యటించగా.. ఆ తర్వాత ప్రతీ నెలా ఏదో కార్యక్రమంతో ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. మంత్రులు కూడా సీఎం సూచనలకు అనుగుణంగా పలు పర్యటనలు చేస్తున్నారు. అయితే సీఎం ఈ నెలన్నర కాలంలోనే మూడుసార్లు పర్యటించడం చర్చనీయంశంగా మారింది. పాలమూరు-రంగారెడ్డి పనులు పూర్తికాకపోవడంపై బీఆర్‌ఎస్‌ పాదయాత్ర చేపట్టేందుకు యత్నించిన క్రమంలో వారి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గత నెలలో రెండు రోజులు పాలమూరు ప్రాజెక్టుల సందర్శన చేపట్టారు. మొదటి రోజు నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పర్యటించి, పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. రెండో రోజు మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులను సందర్శించి.. ప్రెస్‌మీట్‌తోపాటు జడ్చర్ల సభ ద్వారా ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చారు. ఇక ఈ నెల 4వ తేదీన సీఎం రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ పురిటిగడ్డ మిడ్జిల్‌లో సభ నిర్వహించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎవరినీ మరిచిపోననే కాన్సె ప్ట్‌తో తీసుకున్న సభ విజయవంతం అయ్యింది. తాజాగా మరోసారి బుధవారం మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈసారి ఒక ప్రైవేటు, ఒక ప్రభుత్వ కార్యక్రమమే ఉన్నప్పటికీ.. రెండుచోట్ల బలంగానే తన వాణిని వినిపించే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌ దివిటిపల్లిలోని అమరరాజ గిగా కారిడార్‌లో కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంటును ప్రారంభించనుండగా.. అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఇండస్ర్టీయల్‌ గ్రోత్‌ను పెంచాలనే ఉద్దేశంతో గతంలో ఎస్‌జీడీ కార్నింగ్‌ పరిశ్రమలో నూతన యూనిట్‌ ప్రారంభానికి రాగా, తాజాగా అమరరాజాకు సీఎం వస్తున్నట్లు స్పష్టమవుతోంది.

సీఎంతోపాటు మంత్రులు కూడా..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం ప్రతీ నెలా వస్తుండటంతో పెద్దగా మంత్రుల కార్యక్రమాలు లేవు. ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ కూడా జిల్లాలో చాలా తక్కువసార్లే పర్యటించారు. అయితే నెలరోజుల నుంచి మంత్రులు కూడా విస్తృతంగా ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాలికి బలపం కట్టుకున్న చందంగా అటు సీఎం, ఇటు మంత్రులు అభివృద్ధి పనులకు వరుస శంకుస్థాపన చేస్తున్నారు. గత నెలలో కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి జడ్చర్ల నియోజకవర్గంలో ఏటీసీకి శంకుస్థాపన చేయగా, ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వనపర్తిలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌తోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అదే రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నాగర్‌కర్నూల్‌లో పర్యటించి, నూతన బస్టాండ్‌కు శంకుస్థాపన చేశారు. సోమవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నారాయణపేట, మక్తల్‌, గద్వాల జిల్లాల్లో పర్యటించి, సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులతో వేయనున్న హ్యామ్‌ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గద్వాల జిల్లాలో పర్యటించి, విద్యుత్‌ శాఖకు సంబంధించిన పలు సబ్‌స్టేషన్లను ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఇలా రోజూ ఏదో కార్యక్రమం ఉండేలా రాజకీయ హడావిడిని ప్రభుత్వం పెంచినట్లు స్పష్టమవుతోంది.

Updated Date - Jul 14 , 2026 | 11:11 PM