Share News

అల్ర్పాజోలం తయారీ ముఠా అరెస్టు

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:50 PM

అక్రమంగా అల్ర్పాజోలం తయారు చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

అల్ర్పాజోలం తయారీ ముఠా అరెస్టు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌, చిత్రంలో పోలీసు అధికారులు

- రూ.38 లక్షల విలువైన సరుకు, తయారీ సామగ్రి స్వాధీనం

- ఆరుగురు నిందితుల అరెస్టు, పరారీలో మరొకరు

- నాగర్‌కర్నూల్‌ ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : అక్రమంగా అల్ర్పాజోలం తయారు చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కేసు వివరాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 15న బిజినేపల్లి ఎస్‌ఐ ఎస్‌కే శంషుద్దీన్‌కు పక్కా సమాచారం అందడంతో బిజినేపల్లి శివారులోని సర్వే నెంబరు 455లో ఉన్న పొలంలోని రేకుల షెడ్డుపై పోలీసులు దాడి చేశారు. అక్కడ అక్రమంగా అల్ర్పాజోలం తయారు చేస్తున్న నెల్లికంటి నిరంజన్‌రెడ్డి, దాదన గురుమోహన్‌రెడ్డి, వంగా సుభాష్‌గౌడ్‌, ఏడుదుడ్ల భాస్కర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.6 కిలోల అల్ర్పాజోలం, తయారీ పరికరాలు, నాలుగు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

దశల వారీగా వివిధ ప్రాంతాల్లో తయారీ

ముఠా కార్యకలాపాలకు సంబంధించిన కీలక విషయాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు నిరంజన్‌రెడ్డి జైలులో ఉన్న హనుమంతురెడ్డి వద్ద అల్ర్పాజోలం తయారీని నేర్చుకు న్నాడు. దాదన గురుమోహన్‌రెడ్డి కర్ణాటకలోని రాయచూరుకు చెందిన వేణుగోపాల్‌ నుంచి ముడిసరుకులను సమకూర్చేవాడు. వాటిని ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కాజీపేట మండలం కూనర్‌పల్లి గ్రామానికి చెందిన వెంకటకృష్ణారెడ్డికి అందించేవారు. అక్కడ తయారీ ప్రక్రియలో తొలి మూడు దశలను పూర్తి చేసి, ఆ పదార్ధాన్ని బిజినేపల్లికి తరలించే వారు. మిగిలిన రెండు దశల ప్రక్రియను పూర్తి చేసి, అల్ర్పాజోలంను తయారు చేసేవారు. ఆ తర్వాత వంగా సుభాష్‌గౌడ్‌ ద్వారా కల్లు కాం పౌండ్లకు విక్రయించేవారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని కూనర్‌పల్లి గ్రామంలోనూ దాడులు నిర్వహించి వెంకట కృష్ణారెడ్డి, ఏనుగు రాజశేఖర్‌రెడ్డిలను అరెస్టు చేశారు. అక్కడ అల్ర్పాజోలం తయారీకి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిరం జన్‌రెడ్డి అల్ర్పాజోలం తయారీలో చివరి దశను నిర్వహిస్తుండగా, గురుమోహన్‌రెడ్డి ముడిసరుకుల సరఫరాదారుగా, సుభాష్‌గౌడ్‌ పంపిణీ దారుగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటకృష్ణారెడ్డి తొలి మూడు దశల తయారీ ప్రక్రియను నిర్వహించేవాడని, ఏడుదుడ్ల భాస్కర్‌రెడ్డి, ఏనుగు రాజశేఖర్‌రెడ్డి రవాణా, సహయకులుగా పనిచేసేవారని వెల్లడించారు. ముడిసరుకుల సరఫరాదారు రాయచూరుకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు రూ.26 లక్షల విలువైన 2.6 కిలోల అల్ర్పాజోలం, రూ.12 లక్షల విలువైన తయారీ పరికరాలు, రసాయనాలు, ఆరు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాటి విలువ రూ.38 లక్షలుగా అంచనా వేశారు. నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఛేదించిన సీఐ అశోక్‌రెడ్డి, సీపీఎస్‌ సీఐ శంకర్‌, బిజినేపల్లి ఎస్‌ఐ శంషుద్దీన్‌, కేయూఎం ఎస్‌ఐతో పాటు సీసీఎస్‌, ఐడీ పార్టీ సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ అభినందించారు.

Updated Date - Nov 16 , 2026 | 11:50 PM