ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:31 PM
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు, భూత్పుర్, దేవరకద్ర మునిసిపాలిటీల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.
- మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్సు
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 22(ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు, భూత్పుర్, దేవరకద్ర మునిసిపాలిటీల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మునిసిపల్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను మ్యాపింగ్ చేసి ప్రచురించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులను ఒక విడత పరిశీలించినట్లు తెలిపారు. పోలింగ్ నిర్వహణకు సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారని, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కౌటింగ్ నిర్వహణకు పాలమూరు యూనివర్సిటీ భవనాలను పరిశీలించినట్లు చెప్పారు. జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్యాడ్, ఎస్‌ఎస్‌టీ బృందాలకు మెజిస్టీరియల్ అధికారాలు కల్పించేందుకు ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. ఎలాంటి తప్పిదాలకూ తావు లేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, నోడల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.