నారాయణపేటలో.. ఏసీబీ రైడ్స్
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:29 PM
గద్వాలలో ఆర్డీఓగా పనిచేసిన రామ్‌చందర్‌నాయక్ నారాయణపేటలో లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు.
- గద్వాల జిల్లాలో ప్రకంపనలు
- ఇక్కడే అవినీతి అక్రమాల మార్క్
- 800కు పైగా తప్పుడు ఓఆర్‌సీల జారీ..?
- వాటిని అమలు చేయలేక తలలు పట్టుకున్న అధికారులు
గద్వాల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): గద్వాలలో ఆర్డీఓగా పనిచేసిన రామ్‌చందర్‌నాయక్ నారాయణపేటలో లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన గద్వాలలోనే అక్రమ వసూళ్లకు తెరలేపారు. పనిచేసిన ఏడాదిలోపే అయన చేసిన అక్ర మాలు అంతాఇంత కాదు. రెగ్యులర్ ఉద్యోగులను పక్కకు పెట్టి అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఫైల్స్ తయారు చేయించి ఎవరైతే ఆయనను కలుస్తారో వారికి రికార్డు చేసేవాడు. ధర విషయంలో ఫటాఫట్ ధనాధన్ అనే విధంగా ఒకటి రెండు మాటల్లోనే కుదుర్చుకొని రెండు మూడు రోజుల్లోనే వారికి అనుకూలంగా రికార్డు మార్చేవాడు.
పైసలిస్తే పనుల్లో వేగం..
పైసలిస్తే ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా పూర్తి చేసేవారు. ఆయన స్పీడ్‌ను చూసి పైరవీకారులు ఎక్కడెక్కడ భూ సమస్యలు ఉన్నా యో గుర్తించి ధరమాట్లాడుకుని ఆర్డీవో ముందు ఉంచేవారు. మధ్యవర్తులతో మాట్లాడటానికి, ఫైల్స్ తయారు చేయడానికి ఏకంగా కొత్త హౌజింగ్ బోర్డులో ఒక ఆఫీసునే తెరిచి నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కాంట్రాక్ట్, అవుట్‌సోర్స్ ఉద్యోగులు పనిచేసేవారు. ఆర్డీవో కార్యాయంలో ఆయనకంటే ముందున్న ఆర్డీ వో చాలా వరకు ఓఆర్‌సీలు పెండింగ్ పెట్టారు. ఈయన ఆర్డీవోగా వచ్చిన తర్వాత ఓఆర్ సీలపై ఎక్కువ దృష్టి పెట్టి ఇవ్వలేని ఇనామ్ భూములకు కూడా ఓఆర్‌సీలను జారీ చేశా రు. ఇలా ఎనిమిది నెలల్లోనే 2వేలకు పైగా ఎకరాలకు ఓఆర్‌సీలను జారీ చేశాడు. ఇందులో దాదాపు 80శాతం తప్పుడు ఓఆర్‌సీలే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు కూడా ఓఆర్ సీలు జారీ చేశాడు. చాలా వరకు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోలేదు. ఈ యన జారీ చేసిన ఓఆర్‌సీలను సంబంధిత తహసీల్దార్‌లు అమలు చేయలేక కలెక్టర్ దృష్టికి తీసుకపోయిన సందర్భాలు ఉన్నాయి. కొందరు అవినీతి సొమ్ముకు ఆశపడ్డ తహసీల్దార్ వచ్చిన కాడికి దండుకొని అమలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న అక్రమాలపై పత్రికలలో కథనాలు రావడంతో రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న ఆయనను నారాయణపేటకు బదిలీ చేశారు. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ఆ యన శిశ్యుల ద్వారా పాత తేదీలతో కొంతకాలం పాటు ఓఆర్‌సీలు జారీ అయినట్లు సమాచారం. అయితే మంగళవారం ఏసీబీకి పట్టుబడటంతో ఆయన ద్వారా నష్టపోయిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులలో గుబులు మొదలైంది. అప్పట్లో ఆయనకు జిల్లా ఉన్నతాధికారులు కూడా సహకరించారు. ప్రోత్సహించారు. ఆర్డీవో చేసిన అక్రమాలపై గద్వాలలో విచారణ చేస్తే తమ వ్యవహారాలు ఎక్కడ బయట పడుతాయోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది.
గద్వాలలో మూడు రోజులు మకాం
వాస్తవానికి ఏసీబీ అధికారులు గద్వాలలో మూడు రోజులు మకాం వేసినట్లు సమాచారం. గద్వాల జిల్లాలో ఓ ఉన్నతాధికారి చేస్తున్న అవినీతిపై వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది. గత కలెక్టర్‌కు రెవెన్యూపై పెద్దగా పట్టులేకపోవడంతో ఆయన చూసిచూడనట్లు వదిలేశారు. ప్రస్తుతం వచ్చిన కొత్త కలెక్టర్ అన్ని శాఖలపై పట్టు ఉంది. దీంతో ఆ అధికారి చేస్తున్న తప్పులను కూడా గుర్తించి హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ అధికారి అవినీతిపై ఏసీబీకి సమాచారం అందడంతో వారు కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఓ అధికారి ఏసీబీకి చిక్కే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ పట్టుబడాల్సిన అధికారి జాగ్రత్తలు తీసుకోవడంతో ఏసీబీ నారాయణపేటపై దృష్టిపెట్టి ఆర్డీవోను పట్టుకున్నది.