కనుల పండువగా జగన్నాథ రథయాత్ర
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:33 PM
పాలమూరు పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కనుల పండువగా కొనసాగింది.
- జై జగన్నాథ్ నామస్మరణతో మారుమోగిన పాలమూరు
- పాల్గొన్న ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కనుల పండువగా కొనసాగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్ర టీచర్స్‌కాలనీలోని ఇస్కాన్ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. మెట్టుగడ్డ, న్యూటౌన్, కొత్త బస్టాండ్, అశోక్‌నగర్ చౌరస్తా, గడియారం చౌరస్తా, తెలంగాణ చౌరస్తాల మీదుగా టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్నది. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూరి జగన్నాథ రథయాత్రను దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా భక్తులు దర్శిస్తారన్నారు. అదే స్ఫూర్తితో మన పట్టణంలోనూ రథయాత్రను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని జగన్నాథుడిని వేడుకున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తుల రథాన్ని భక్తులు పోటీపడి లాగారు. రథం ముందు నృత్యాలు, భజనలు, కోలాటాలు వేశారు. ఈ సందర్భంగా జై జగన్నాథ్ నామస్మరణతో పట్టణం మారుమోగింది. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, రథయాత్ర అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు, నగరంలోని పలు ఆలయాల భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.