వెయ్యి పడకలు.. ఎదురుచూపులు....!
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:28 PM
మహబూబ్‌నగర్ నడిబొడ్డున నిర్మాణమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
- వరంగల్, టిమ్స్ ఆసుపత్రులకు ఇటీవల కేడర్ అలాట్‌మెంట్
- మహబూబ్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మొండిచేయి
- నిర్మాణం ప్రారంభించిన మూడేళ్లకు ఈవీఎం గోదాం తరలింపు
- శరవేగంగా అయిదో బ్లాకు.. వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం
- అత్యాధునిక ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యసేవలు
మహబూబ్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పాలమూరు జిల్లా నడిబొడ్డున నిర్మిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై పాలకులు కరుణ చూపించడం లేదు. ఇటీవల నిర్మాణంలో ఉన్న వరంగల్, టిమ్స్ ఆసుపత్రులకు 6,278 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలపగా.. ఇప్పటికే ఒక్క బ్లాకు మినహా మిగతా నిర్మాణం పూర్తి చేసుకుని సేవలకు అందుబాటులోకి వచ్చిన పాలమూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మాత్రం విస్మరించారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా రెండు రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఇక్కడి ప్రజలు వెళ్లి వైద్యం చేయించుకోలేరు. హైదరాబాద్‌కు వెళ్లాలంటే దూరాభారం అవుతోంది. మహబూబ్‌నగర్‌లో జీజీహెచ్ ఉన్నప్పటికీ కేడర్ స్ర్టెంత్‌కు తగ్గట్లుగా సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో 2022, డిసెంబర్ 22న రూ. 270 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు మూడున్నరేళ్ల సమయం పూర్తి కాగా.. రెండున్నరేళ్లకే మొత్తం అయిదు బ్లాకులకు గాను నాలుగు బ్లాకుల నిర్మాణం పూర్తయ్యింది. ప్రభుత్వం మారినా నిర్మాణం ఆగలేదు. అయితే పాత కలెక్టరేట్ భవనాన్ని తొలగించి.. ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించగా.. అయిదో బ్లాకు నిర్మించాల్సిన స్థలంలో ఈవీఎం గోదాం ఉండటంతో పనులకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ బ్లాకును వదిలేసి మిగతాది పూర్తిచేశారు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఇటీవల నిర్మాణం ప్రారంభించగా.. దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు బ్లాకుల్లోనే సేవలు ప్రారంభించడానికి అనువుగా ఉంది. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ప్రారంభమైతే.. హైదరాబాద్‌కు వెళ్లకుండా ఇక్కడే సేవలు పొందవచ్చని ప్రజలు భావిస్తున్నారు.
మౌలిక వసతులకు రూ. 200 కోట్లు
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మౌలిక వసతులకు రూ. 200 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 14 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి ఎంఆర్‌ఐ, సిటీస్కాన్, అల్ర్టాసౌండ్ స్కానింగ్, డిజిటల్ ఎక్స్‌రేలు, క్యాత్‌ల్యాబ్, ఫర్నిచర్, ఎలక్ర్టికల్, కంప్యూటర్ సిస్టంలు, ల్యాబ్ సామగ్రి కలుపుకుని అంత మొత్తం అవసరం కానున్నది. వాటి కేటాయింపును కూడా ఇప్పటి వరకు చేయలేదు. అలాగే 394 మంది డాక్టర్లు అవసరం కానున్నారు. ఇందులో స్పెషాలిటీ కింద 254 మంది, సూపర్ స్పెషాలిటీ కింద 140 మంది అవసరం.. 34 మంది ప్రొఫెసర్లు, 79 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 112 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 115 మంది సీనియర్ రెసిడెంట్లు, 28 మంది జూనియర్ రెసిడెంట్లు, 40 మంది ట్యూటర్లు అవసరం ఉంది. ఇటీవల వరంగల్ మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 2,100 పడకలకు గాను 788 పోస్టులు మంజూరయ్యాయి. ఓవైపు కేడర్ స్ర్టెంత్ అలాట్‌మెంట్ కాకపోవడం, మౌలిక వసతుల కల్పనపై వైద్యారోగ్యశాఖ దృష్టి సారించకపోవడంతో సాగదీత ధోరణిని అవలంభిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇదే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం.. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ జిల్లాకు ఇన్‌చార్జిగా ఉండటంతో ప్రజల్లో ఎక్కువ అంచనాలు ఉన్నాయి.
ప్రారంభిస్తే సేవలు మెరుగు
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయగా.. అందులో మహబూబ్‌నగర్ ఒకటి.. ఇప్పుడు మెడికల్ పీజీ విద్యను కూడా ఇక్కడి విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారి సేవలను వినియోగించుకోవడంతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనేది కచ్చితంగా అవసరం. మహబూబ్‌నగర్ నడిబొడ్డున నిర్మించడం వల్ల రోగులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని గతంలో ఆలోచించారు. అయితే ఈవీఎం గోదాం విషయంలో సంక్లిష్టత ఏర్పడటంతో చాలా ఆలస్యమైంది. ఆ సమస్య పరిష్కారం కావడంతో ప్రస్తుతం అయిదో బ్లాకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది. అలాగే స్పెషాలిటీ సేవలకు అనుగుణంగా కేడర్ స్ర్టెంత్‌ను అలాట్ చేయాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఆసుపత్రి పూర్తయితే గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లాంటి సేవలు ప్రజలకు అందుతాయి. అయితే ఆలస్యం అవుతున్నా కొద్ది ఫర్నిచర్, మెడికల్ మిషనరీ వంటి వాటి ధరలు పెరగడం, స్పెషాలిటీ వైద్యులు ఇతర ఆసుపత్రుల్లో భర్తీ అవుతారనే ఆందోళన ఉంది.