తల్లడిల్లుతున్న టమాట రైతు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:04 PM
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో, పెట్టుబడి రాక రైతులు నిరాశ చెందుతున్నారు.
బాక్సు రూ.100 కూడా రాని వైనం
పెట్టుబడి రాక.. అప్పుల పాలు
గండీడ్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో, పెట్టుబడి రాక రైతులు నిరాశ చెందుతున్నారు. మండలంలో రుసుంపల్లి, సల్కర్‌పేట్, రంగారెడ్డిపల్లి, వెన్నచేడ్, కొంరెడ్డిపల్లి, గండీడ్ గ్రామాల్లో పలువురు రైతులు టమాట సాగు చేశారు. మొదట్లో టమాట ధర కిలో రూ.30 నుంచి 60 వరకు పలకడంతో అధిక లాభాలు వస్తాయని సంతోషించారు. కానీ పంట చేతికొచ్చిన సమయంలో ధర లేకపోవడంతో పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఎకరా పొలంలో టమాట సాగు చేయడానికి రూ.80 వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. టమాట రూ.30 నుంచి రూ.50 కిలో అమ్మితే పెట్టుబడి పోను కొంత లాభం వచ్చేదని రైతులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం 25 కిలోల బాక్సు రూ.100 కూడా పలకకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
పెట్టుబడి ఎక్కువ.. ధర తక్కువ
టమాట తోట పెట్టే రైతులు దుక్కి దున్ని పొలాన్ని చదును చేసుకొని నర్సరీల నుంచి రూపాయికి ఒక మొక్క చొప్పున కొనుగోలు చేసి నాటుతున్నారు. ఫర్టిలైజర్, పురుగుల మందులు, కలుపు తీత, కూలీల ఖర్చు అధికమవడంతో ధర తక్కువగా రావడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.