Share News

ముందడుగు

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:04 PM

రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌) పూర్తి వాటా వినియోగానికి చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2పై ముందడుగు పడింది.

ముందడుగు
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం

- తుమ్మిళ్ల ఎత్తిపోతలపై సర్కారు చర్యలు షురూ

- మల్లమ్మకుంట రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపునకు నిర్ణయం

- ఆర్డీఎస్‌ పూర్తివాటా వినియోగానికి ఇదే మార్గం

- సీఎంకు వివరించిన ఇరిగేషన్‌ శాఖ అధికారులు

- భూ సేకరణకు సిద్ధమైన ప్రభుత్వం

- రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ

గద్వాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌) పూర్తి వాటా వినియోగానికి చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2పై ముందడుగు పడింది. తుంగభద్ర డ్యామ్‌ గేట్ల ప్రారంభోత్సవానికి వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఆర్డీఎస్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా ఏళ్ల నుంచి ఆర్డీఎస్‌ నుంచి రావాల్సిన 15.9టీఎంసీల నీటి వాటా రావడం లేదని, ఆర్డీయస్‌లో పూడిక, కాలువలు సక్రమంగా లేకపోవడం, కర్ణాటక నీటి దోపిడితో 6టీఎంసీల నుంచి 7టీఎంసీల వరకు కూడా నీళ్లు రావడం లేదని ఇరిగేషన్‌ వారు నివేదించారు. అదే విధంగా ఆర్డీఎస్‌ ఆయకట్టు మాజీ చైర్మన్‌ తనగల సీతారాంరెడ్డి, రైతులు కూడా ఆర్డీఎస్‌ పరిస్థితిపై సీఎంకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తుమ్మిళ్ల ప్రాజెక్టుపై చర్చ జరగగా ఫేజ్‌-1లో పంపు హౌజ్‌లతో పాటు ఆర్డీఎస్‌ కాలువ వరకు పైపులైన్‌ పూర్తి చేసి ఎత్తిపోస్తున్నామని, ఫేజ్‌-2లో నిర్మించాల్సిన రిజర్వాయర్లు పూర్తికాకపోవడంతో పూర్తిస్థాయిలో సాగునీటిని అందించలేకపోతున్నామని అధికారులు వివరించారు. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ భూసేకరణ పెండింగ్‌లో ఉందని వివరించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి తుమ్మిళ్ల పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మల్లమ్మకుంట రిజర్వాయర్‌ విస్తరణ పెంపుపై నిర్ణయం

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో ఫేజ్‌-2లో నిర్మించాల్సిన మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు రిజర్వాయర్లలో మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు మాత్రమే పరిపాలన అనుమతులు ఉన్నాయి. సీఎం సమీక్ష సందర్భంగా పరిపాలన అనుమతులు ఉన్న మల్లమ్మకుంట రిజర్వాయర్‌ సామర్థ్యం 1.10టీఎంసీల నుంచి 6టీఎంసీలకు విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు 567ఎకరాలు భూసేకరణ చేయాల్సి గతంలో నిర్ణయించారు. విస్తరిస్తే మరింత భూసేకరణ చేయాల్సి ఉంటుంది. చాలా ఏళ్ల నుంచి భూసేకరణకు అధికారులు ప్రయత్నంచినా రైతుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. అయితే గత మూడు నెలల క్రితం భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసినా ఫైనల్‌ నోటిఫికేషన్‌ పెండింగ్‌లో పెట్టారు. రైతులకు న్యాయం చేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు ఉన్నాయి. అధికారులు ఎటూ నిర్ణయం తీసుకోకపోవడంతో భూసేకరణ పెండింగ్‌లో ఉంది.. ఇందులో అసైండ్‌ రైతులతో పాటు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వీరితో ప్రజాభిప్రాయం తీసుకోవడానికి గురువారం తనగలలో సమావేశం నిర్వహించారు. వారిలో చాలా మంది భూమికి బదులు భూమి లేదంటే పరిహారం పెంపుతో న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

విస్తరిస్తే... చివరి ఆయకట్టు వరకు సాగునీరు

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగమైన మల్లమ్మకుంట రిజర్వాయర్‌ విస్తరించి పూర్తి చేస్తే ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు 42వ డిస్ర్టిబ్యూటరీ వరకు సాగునీరు అందించవచ్చు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వద్ద మూడు పంపులను ఏర్పాటు చేయగా అందులో రెండు పంపులకు సంబంధించిన నీటి పారుదలను పైపుల ద్వారా నేరుగా ఆర్డీఎస్‌ కాలువకు లింక్‌ చేశారు. వీటిలో ఒక పంపు ద్వారా సాగునీరు అందుతుంది. 70రోజుల పాటు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ సుంకేసుల బ్యారేజీలో నీటి లభ్యత లేని సమయంలో పంపులను ఆఫ్‌ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు మళ్లీ ఇబ్బందులో పడుతున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను విస్తరించి నిర్మిస్తే 6టీఎంసీల వరకు నిల్వచేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పటికే మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మించే తనగల గ్రామం వరకు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైపులైన్‌ నిర్మాణం పూర్తి అయ్యింది. రిజర్వాయర్‌ నిర్మించడమే ఆలస్యం. ఇది జరగాలంటే రైతులు సహకరించడంతో పాటు ప్రభుత్వం ఫేజ్‌-2లో నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం స్వరూపం ఇది..

ఏపీ, కర్ణాటక రాష్ర్టాలతో ఆర్డీఎస్‌ రైతాంగానికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 15.9టీఎంసీల పూర్తి వాటా వినియోగానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం 2017లో రూ.783కోట్లతో నిర్మించేందుకు జీఓ జారీ చేసింది. 2018 జనవరి 9వ తేదీన అప్పటి సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి విడతలో రూ. 389 కోట్లతో ఎత్తిపోతల పథకం, పంపులు, పైపులైన్‌ నిర్మాణం పూర్తి చేసింది. 2019 ఆగస్టు 14న నీటిని ఎత్తిపోసి ఆర్డీఎస్‌ కాలువకు లింక్‌ చేసింది. రెండవ దశ రూ. 386 కోట్లతో మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. కానీ మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు మాత్రమే పరిపాలన అనుమతులు ఇచ్చింది. అప్పటి నుంచి రెండవ దశ పెండింగ్‌లోనే ఉంది. మొదటి దశ పూర్తి అయిన రిజర్వాయర్లు లేకపోవడంతో పూర్తిస్థాయి సాగుకు నీరందించలేని పరిస్థితి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షతో మళ్లీ ఆర్డీఎస్‌ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Updated Date - Jun 25 , 2026 | 11:04 PM