ముదురుతున్న వివాదం
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:36 PM
జూరాల ప్రాజెక్టు కేంద్రంగా ఏడాదిగా వివాదాలు నెలకొంటున్నాయి. ప్రాజెక్టు భద్రత విషయమై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది.
జూరాల వంతెనకు నిధుల బదిలీకి ఇరిగేషన్ శాఖ ససేమిరా!
రూ.121 కోట్లతో కొత్తపల్లి- జూరాల మధ్య నిర్మాణానికి టెండర్లు
డ్యామ్‌కు డౌన్‌స్ర్టీమ్‌లో 12 కిలో మీటర్ల దూరం ఉండటంతో అభ్యంతరం
భద్రత దృష్ట్యా కిలోమీటర్ పరిధిలోనే బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం
దూరమే కారణమైతే డౌన్‌స్ర్టీమ్‌లో మరో బ్రిడ్జి నిర్మించాల్సిందే
మహబూబ్‌నగర్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జూరాల ప్రాజెక్టు కేంద్రంగా ఏడాదిగా వివాదాలు నెలకొంటున్నాయి. ప్రాజెక్టు భద్రత విషయమై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. అయితే అవి కూడా వివాదాలు, ఆయకట్టు రైతుల్లో ఆందోళన పెరగడానికి కారణమవుతున్నాయని చె ప్పొచ్చు. కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును 1995లో నిర్మించారు. ప్రధానంగా రెండు కాలువల ద్వారా 1.04 లక్షల ఎకరాలకు నీరివ్వడం దీని ఉ ద్దేశం. కాగా, ఇప్పుడు అది బహుళార్థక ప్రాజెక్టుగా మారింది. తాగు, సాగు, విద్యుదుత్పత్తి, పరిశ్రమల అవసరాలను కూడా తీరుస్తోంది. ప్రాజెక్టు కట్టిన సమయంలోనే ఆనకట్టతోపాటు.. దిగువన ఒక హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా నిర్మించ లేదు. దీంతో 30 సంవత్సరాలుగా ఆనకట్టపై నుంచే భారీ, అతిభారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీనివల్ల రబ్బర్ సీల్స్ కదులుతుండటం, ఇనుపతాళ్లు వదులుకావడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయి. గత సంవత్సరం లీకేజీలు ఏర్పడి వివాదాలు చెలరేగడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా నూతన బ్రిడ్జిని మంజూరు చేస్తామని ప్రకటించారు. మాట ఇచ్చినట్లుగానే నందిమల్ల-రేవులపల్లి మధ్య (డౌన్ స్ర్టీమ్‌లో ఒక కిలోమీటర్ దిగువన) బ్రిడ్జి నిర్మాణానికి 1 జూలై 2025న జీఓఆర్‌టీ నెంబర్ 292ను విడుదల చేశారు. రూ.121.92 కోట్లతో బ్రిడ్జి నిర్మించాలని, అప్పుడు ప్రా జెక్టు భద్రతకు ప్రమాదం ఉండదని అధికారులు కూడా భావించారు. అయితే నిర్మాణ ప్రాంతంపై అనేక వివాదాలు చెలరేగాయి. దీంతో సెప్టెంబరులో జీఓ నెంబర్ 405ని ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం ముందు అనుకున్న విధంగా కాకుండా జూరాల-కొత్తపల్లి (డౌన్‌స్ర్టీమ్‌లో 12 కిలోమీటర్ల దిగువన) మధ్య చేపట్టాలని నిర్ణయించారు. ఆర్‌అండ్‌బీ ద్వారా టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. రూ.85 కోట్లకే పనులు దక్కించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నవంబరులో ఆత్మకూరులో శంకుస్థాపన కూడా చేశారు.
దూరమే ప్రధాన వివాదం..
నందిమల్ల- రేవులపల్లి మధ్య బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రాజెక్టు భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు భావిస్తున్నారు. కానీ మార్చిన జీఓ వల్ల నిర్మాణ ప్రాంతం కొత్తపల్లి-జూరాలకు చేరింది. దీనివల్ల ఆ బ్రిడ్జి అప్‌స్ర్టీమ్‌లో ఉన్న 20 గ్రామాల ప్రజలు తిరిగి డ్యాం బ్రిడ్జినే వినియోగిస్తే భద్రత ముప్పు అలాగే ఉంటుందని ఇరిగేషన్ అధికారులు వాదిస్తున్నారు. ఇటీవల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలో కూడా అదే విషయాన్ని ఇరిగేషన్ అధికారులు చెప్పబోగా.. మంత్రి శ్రీహరి తప్పుదోవ పట్టించొద్దని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేవలం ఆత్మకూరు- గద్వాల మధ్య దూరం తగ్గడం కోసమే డ్యాం భద్రతను తాకట్టు పెడుతున్నారనే వాదన కూడా బలంగా ఉం ది. జూరాల- కొత్తపల్లి మధ్య వంతెన కడితే గద్వాలకు సుమారు 11 కిలోమీటర్ల దూరం కానుండగా, నందిమల్ల- రేవులపల్లి వద్ద కడితే ఆత్మకూరు- గద్వాల మధ్య 28 నుంచి 30 కిలోమీటర్ల దూరం కానుంది. ఈ నేపథ్యంలోనే సేఫ్టి బ్రిడ్జి అంశంపై వివాదం చెలరేగింది. అయితే ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ కొత్తపల్లి- జూరాల మధ్య పనులు చేపట్టగా.. వాటిని ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. నిధులను ఇరిగేషన్ నుంచి బదిలీ చేయాల్సి ఉంది. అందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులు నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను జారీ చేయాలి. కానీ ఆ అధికారులు ప్రస్తుతం నిర్మిస్తున్న వంతెన స్థలం డ్యాం భద్రతకు ఉపయోగపడదనే ఉద్దేశంతో ఎన్‌ఓసీ ఇవ్వడం లేదు. దీంతో ఇరిగేషన్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్రీ మాన్‌సూన్, పోస్ట్ మాన్‌సూన్ నివేదికలను సీడబ్ల్యూసీకి పంపినప్పుడు వంతెన విషయాలను పొందుపర్చితే డ్యామ్ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు ఆ సమయంలో ఉన్న అధికారులే బాధ్యత వహించేలా డ్యామ్ సేప్టి యాక్ట్- 2021లో నిబంధనలు ఉండటం అధికారుల భయానికి కారణం.
స్థలమార్పు లేకుంటే మరో బ్రిడ్జి..
ఇప్పటికే కొత్తపల్లి- జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు ఖరారు కావడం, పనులు ప్రారంభం కావడంతో ప్రజాభీష్టం మేరకే నిర్మాణం చేపడుతున్నామని మంత్రి వాకిటి శ్రీహరి చెబుతున్నారు. అయితే పనులు ప్రారంభించినప్పటికీ ఎన్‌ఓసీ ఇచ్చి.. ఇరిగేషన్ నిధులు బదిలీ అయిన తర్వాతే వేగం పెంచుతామని కాంట్రాక్టర్ పనులను నిలిపేశారు. దీంతో ఎన్‌ఓసీ కోసం ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. టెండర్లు అయిన పని కాబట్టి ఇరిగేషన్‌తో సంబంధం లేకుండా నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే జూరాల భద్రత దృష్ట్యా మరో బ్రిడ్జిని కచ్చితంగా నిర్మించాల్సి ఉంటుంది. ఎంపీ డీకే అరుణ సైతం ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. సేఫ్టీ బ్రిడ్జిని ఒక కిలోమీటర్ పరిధిలోనే నిర్మించాలని సూచిస్తున్నారు. వాస్తవానికి 2012లోనే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఎన్ ఈశ్వరప్ప, కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్యాసేఫ్టీ బృందం జూరాల డౌన్‌స్ర్టీమ్‌లో ఒక కిలోమీటర్ దూరంలో బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుంచి బ్రిడ్జి డిజైన్లను వేయించారు. 2022లో మరోసారి డ్యాం సేఫ్టీ ప్యానెల్-2 కూడా త్వరితగతిన ప్రత్యామ్నాయ బ్రిడ్జి నిర్మించాలని సూచించింది. దీంతో డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ స్కీం కింద నిధుల కోసం సీడబ్ల్యూసీకి పంపించారు. బ్రిడ్జి నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని సీడబ్ల్యూసీ తిరిగి పంపించింది. గత సంవత్సరం భద్రతపై ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.121.94 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేసినా.. అది డ్యాం భద్రతకు పెద్దగా ఉపయోగపడదనే వాదన వస్తోంది.