Share News

ఆకాశమార్గాన ఆనంద విహారం

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:35 PM

పర్యాటకులు ఆకాశమార్గంలో ఆనంద విహారం చేయనున్నారు. హెలిక్యాప్టర్‌లో ప్రయాణిస్తూ నాగర్‌కర్నూలు జిల్లాలోని సోమశిల అందాలు, కృష్ణానది సోయగాలు, దట్టమైన నల్లమల అడవులను తిలకించనున్నారు.

ఆకాశమార్గాన ఆనంద విహారం
కృష్ణానది తీరాన సిద్దమవుతున్న హెలిప్యాడ్‌

- సోమశిలలో పూర్తయిన హెలిప్యాడ్‌ నిర్మాణం

- ఈనెల 9న హెలిటూరిజం ప్రారంభం

కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : పర్యాటకులు ఆకాశమార్గంలో ఆనంద విహారం చేయనున్నారు. హెలిక్యాప్టర్‌లో ప్రయాణిస్తూ నాగర్‌కర్నూలు జిల్లాలోని సోమశిల అందాలు, కృష్ణానది సోయగాలు, దట్టమైన నల్లమల అడవులను తిలకించనున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీన హైదరాబా ద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రారంభించనున్నది. ప్రైవేటు నిర్వాహకులు చేపట్టిన ‘హెలి టూరిజం’లో భాగంగా హైదరాబాద్‌ నుంచి సోమశిల మీదుగా శ్రీశైలం వరకు హెలికాప్టర్‌ పర్యటన ప్రారంభం కానున్నది. అందుకోసం సోమ శిల గ్రామంలో అవసరమైన హెలిప్యాడ్‌ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశారు. విశాలమైన రోడ్డు సౌకర్యంతో పాటు ఒక ఎకరం భూమిలో హెలిప్యాడ్‌ ను సిద్ధం చేశారు. మూడు రోజుల నుంచి జరుగుతున్న భూ వివాదాల మధ్యనే ఈ పనులు పూర్తయ్యాయి. హెలి టూరిజంలో భాగంగా 9వ తేదీన సోమశిల గ్రామానికి రానున్న హెలిక్యాప్టర్‌ను చూసేందుకు గ్రామస్థులు, కొల్లాపూర్‌ మండల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పర్యాటకులు హెలిక్యాప్టర్‌లో ముందుగా సోమశిలకు చేరుకోనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకొని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. దైవదర్శనం అనంతరం అదే హెలిక్యాప్టర్‌లో శ్రీశైల క్షేత్రానికి బయలుదేరి వెళ్లనున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:35 PM