ఒక్కో కేసుకు ఒక్కో రేటు
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:34 PM
సర్జీరీ కేసుకు ఇంత? వైద్య పరీక్షలకయితే ఇంత? ఓపీకైతే ఇంత?... ఇలా ఒక్కో కేసుకు ఒక్కో రేటు.. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్‌ఎంపీలు చేస్తున్న కమీషన్ల దందా! జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.. ఆర్‌ఎంపీలు కలిసి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు.
- పాలమూరు జిల్లాలో ఆర్‌ఎంపీల దందా
- ప్రైవేటు ఆసుపత్రుల నుంచి విచ్చలవిడిగా కమీషన్లు
- సర్జరీకి రూ. 5వేల నుంచి రూ. 10వేలు
- టెస్టులకు రూ. 1000 నుంచి రూ. 1500
- ఓపీకి రూ. 500 నుంచి రూ. 1000
- దృష్టి సారించని వైద్య ఆరోగ్యశాఖ
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం), నవంబర్ 26 (ఆంధ్రజ్యోతి) : సర్జీరీ కేసుకు ఇంత? వైద్య పరీక్షలకయితే ఇంత? ఓపీకైతే ఇంత?... ఇలా ఒక్కో కేసుకు ఒక్కో రేటు.. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్‌ఎంపీలు చేస్తున్న కమీషన్ల దందా! జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.. ఆర్‌ఎంపీలు కలిసి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. వారూ... వీరూ.. కలిసి రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ధరల నియంత్రణ, ఆర్‌ఎంపీల కమీషన్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అఽధికారులు దృష్టి సారించకపోవడంతో వారి ఆగడాలు కొనసాగుతున్నాయి. ప్ర స్తుతం జిల్లావ్యాప్తంగా 250కి పైగానే ప్రైవేటు ఆసుపత్రులు దాదాపు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోనే దాదాపు 150 వరకు ఉన్నాయి. వీటిలో స్పెషాలిటీ, సూపర్, మల్టీ స్పెషాలిటీ పేరుతో వంద వరకు కొనసాగుతున్నాయి. వాటిల్లో ఫీజులు కూడా అదేస్థాయిలో వసూలు చేస్తున్నారు. జ్వరం వచ్చి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రూ. 2 వేల నుంచి రూ. 3వేల వరకు ఖర్చు అవుతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోందని లోతుగా ఆలోచిస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.
ఇదీ దోపిడీ జరుగుతున్న తీరు
గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైనా సర్జరీ చేయాల్సి ఉన్నా, గుండె, నరాలు, కీడ్నీ వ్యాధుల బారిన పడినా.. అక్కడ ఉండే ఆర్‌ఎంపీలు వారిని జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. వారు తప్పనిసరిగా ఆ ఆసుపత్రికే వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే వారిని భయాందోళనలకు గురి చేసి అదే ఆసుపత్రికి వెళ్లేలా చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది రోగితో మా ట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు పంపించారు? అని అడిగి రిజిస్టర్‌లో రాసుకుంటారు. అందుకోసం ఆర్‌ఎంపీలు ఆయా ప్రైవేటు ఆసుపత్రులతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వాళ్లు పంపిన కేసుకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు వారికి కమీషన్ చెల్లిస్తున్నాయి. ఈ వ్యవహారం సజావుగా సాగేలా ప్రతీ ఆసుపత్రిలో పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారే వెళ్లి ఆర్‌ఎంపీలకు నెల నెలా కమీషన్ ఇచ్చి వస్తున్నారు.
జబ్బును బట్టి కమీషన్ ఫిక్స్
ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన రోగికి జబ్బును బట్టి కమీషన్‌ను ఫిక్స్ చేశారు. సర్జరీ చేయాల్సిన కేసుకు రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు ఇస్తున్నారు. టెస్టుల కోసం ఆసుపత్రికి వెళితే రూ. 1000 నుంచి రూ. 1500 వరకు ఇస్తున్నారు. దీంతో పాటు ఓపీ చూపించుకోవాలనుకుంటే రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఇస్తున్నారు. ప్రై వేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ కమీషన్ డబ్బులను రోగికి వేసే ఫీజులో కలిపి వేస్తున్నారు. దీంతో ఓపీ చూపించుకోవడానికి వెళ్లిన వారికి మందులతో కలిపి రూ. 2వేల నుంచి రూ. 3 వేల వరకు ఖర్చు అవుతోంది. అదేవిధంగా కేవలం టెస్టులు చేయించాల్సి వస్తే ఆ రోగికి టెస్టులు రూ. 3వేల నుంచి రూ. 4వేలు, మందులు రూ. 2వేలు కలిపి మొత్తం రూ. 5వేల నుంచి రూ. 6వేల వరకు ఖర్చు అవుతోంది. సర్జరీ కోసం స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ. 60 వేల వరకు, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు రోగులు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఈ తరహా కేసుల్లో ఆర్‌ఎంపీలకు వచ్చే కమీషన్ భారీగానే ఉంటోంది. ఒక్కో కేసుకు వారు చెల్లించే బిల్లును బట్టి రూ. 5వేల నుంచి రూ. 20 వేల వరకు కూడా కమీషన్ ఇస్తున్న ఆసుపత్రులు ఉన్నట్లు సమాచారం.
రెఫరల్ దందాపై చర్యలు
ప్రైవేటు ఆసుపత్రులకు కేసులను రెఫర్ చేస్తూ దందాను నడిపిస్తున్న ఆర్‌ఎంపీలపై చర్యలు తీసుకుంటాం. ముందుగా జిల్లాలోని ఆర్‌ఎంపీల జాబితాను రూపొందించి సమావేశం నిర్వహిస్తాం. స్థాయికి మించి వైద్యం చేయొద్దని, ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేసి కమీషన్ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తాం. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తాం. ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి రెఫరల్ విధానాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో