రెండు జిల్లాల మధ్య ‘వారధి’
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:30 PM
వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండల పరిధిలోని జూరాల నుంచి గద్వాల జిల్లా కొత్తపల్లి వరకు కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం
- జూరాల నుంచి గద్వాలకు తగ్గనున్న దూరం
- ఇప్పటికే కృష్ణానదిలో మట్టి రోడ్డు ఏర్పాటు
- ఏడాదిన్నర లోపు పూర్తి కానున్న పనులు
ఆత్మకూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండల పరిధిలోని జూరాల నుంచి గద్వాల జిల్లా కొత్తపల్లి వరకు కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు పూర్తయితే రెండు జిల్లాల మధ్య దూరం తగ్గనున్నది. గతంలో వేసవిలో నదిలో నీరు లేనప్పుడు ఆత్మకూరు మండల ప్రజలు కాలినడకన గద్వాల జిల్లాకు వెళ్లే వారు. లోయర్ జూరాల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత అందుకు వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఆత్మకూరు మండలం మీదుగా మస్తీపూర్, కృష్ణంపల్లి, నందిమల్ల, ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు మీదుగా గద్వాల జిల్లాకు చేరుకోవాలంటే 35 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాలని మండల వాసులు పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను విన్నవించుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి ఆత్మకూరుకు వచ్చిన వాకిటి శ్రీహరికి మండలవాసులు సమస్యను వివరించారు. ఆయన మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత అందుకు చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పలుమార్లు చర్చలు జరిపారు. గత ఏడాది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించిన అనంతరం హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 121.90కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులను దక్కించుకున్న నిర్మాణ సంస్థ ఇప్పటికే మట్టి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసింది. వేసవికాలం సమీపిస్తున్నందున మరో నాలుగు నెలల పాటు కృష్ణానదికి వరద వచ్చే అవకాశం లేదు. దీంతో పనులను వేగవంతం చేసే అవకాశం ఏర్పడింది. హైలెవల్ వంతెన నిర్మాణ సామాగ్రిని తరలించేందుకు కృష్ణానదిలో వేసిన రోడ్డు ఉపయోగపడనున్నది. అలాగే ఆత్మకూరు నుంచి రోజు వారీగా వందల సంఖ్యలో వాహనాలు జూరాల గ్రామ శివారు నుంచి గద్వాల జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నాయి. కృష్ణానదిపై 760 మీటర్ల మేర హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కేవలం 11 కిలో మీటర్ల దూరం, దాదాపు 15 నిమిషాల్లోనే గద్వాల జిల్లాకు చేరుకోవచ్చని స్థానికులు చెప్తున్నారు. అలాగే గద్వాల జిల్లాకు, ఆత్మకూరు మండల కేంద్రానికి వ్యాపార సంబంధాలు కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది.
మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి
ఏడాదిన్నర లోపు జురాల టు గద్వాల హైలెవల్ బ్రిడ్జిని పూర్తి చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులు, నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు. గత మంగళవారం గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి తాత్కాలిక మట్టి రోడ్డుపై గద్వాల జిల్లాకు కాలినడకన వెళ్తూ, వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. మరో నాలుగు నెలల పాటు కృష్ణానదిలో వరద పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అప్పటిలోగా వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి కొత్తకోట, ఆత్మకూరు మండలాల మీదుగా మంత్రాలయం, బళ్లారి వరకు ఫోర్ లైన్ రహదారి మంజూరైందని తెలిపారు. దీని వలన గద్వాల, వనపర్తి జిల్లాలతో పాటు ఆత్మకూరు మండలం కూడా వేగంగా అభివృద్ధి చెందనున్నది.