Share News

బైకును ఢీకొట్టిన బొలెరో వాహనం

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:30 PM

నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

బైకును ఢీకొట్టిన బొలెరో వాహనం
జొన్నలబొగుడ బస్సు స్టేజీ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితులు కుమ్మరితేజ, ఆరేపల్లి అంజి

- అక్కడికక్కడే ఇద్దరు యువకుల మృతి, ఒకరి పరిస్థితి విషమం

పెద్దకొత్తపల్లి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి నుంచి తమ స్వగ్రామమైన సాతాపూర్‌ కు చెందిన కుమ్మరి ఆంజనేయులు, ఈశ్వరమ్మ దంపతుల రెండవ కుమారుడు కుమ్మరి తేజ(20) అదే గ్రామానికి చెందిన ఆరేపల్లి రాముడు, లక్ష్మీ దంపతులను ఏకైక కుమారుడు ఆరేపల్లి అంజి(19)తో పాటు తమ స్నేహితుడైన నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడితో కలిసి బైకుపై వెళుతున్నారు. ఎదురుగా మామిడి కాయల లోడుతో కొల్లాపూర్‌ వైపు నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు వెళుతున్న బొలెరో వాహనం అతివేగంగా జొన్నలబొగుడ బస్సు స్టేజీ సమీపంలో బైకును ఢీ కొన్నది. దీంతో కుమ్మరి తేజ, ఆరేపల్లి అంజిలు అక్కడికక్కడే దర్మరణం చెందారు. బైకు దగ్ధమైంది. తమ స్నేహితుడైన నల్గొండ జిల్లా కాటన్‌గూడకు చెందిన యువకుడు తరుణ్‌ తీవ్ర గాయాలకు గురై పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో తమ వారసులు మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల కడుపుకోతతో రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని పెద్దకొత్తపల్లి ఎస్‌ఐ సతీష్‌ పరిశీలించారు. మృతుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, మృతదేహాలను పోస్టుమార్టం కోసం కొల్లాపూర్‌కు తరలించారు.

Updated Date - Apr 17 , 2026 | 11:30 PM