ఫలించిన 50 ఏళ్ల నిరీక్షణ
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:41 PM
శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టు భూ సేకరణ ద్వారా నష్టపోయిన వారి యాభై ఏళ్ల నిరీక్షణ ఫలించిందని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు.
- భూ భారతి చట్టం ద్వారా అర్హులకు భూమి
చిన్నంబావి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టు భూ సేకరణ ద్వారా నష్టపోయిన వారి యాభై ఏళ్ల నిరీక్షణ ఫలించిందని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు కొరకు 1976లో ఉమ్మడి వీపనగండ్ల మండలంలోని చిన్నమారూర్, వెల్లటూరు, సోలీపురం, కాలూరు, చెల్లెపాడు, అయ్యవారిపల్లి, కొప్పునూరు గ్రామాల్లో వేల ఎకరాల భూములను సేకరించిన నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. కానీ రికార్డుల నిర్వహణలో పొరపాట్లు జరిగాయని తెలిపారు. చిన్నమారూర్ గ్రామంలోని సర్వే నం. 201 లో 11:34 గుంటల భూమిలో 4.08 భూ సేకరణ జరగగా, మిగిలిన 7.26 గుంటల భూమిని కూడా శ్రీశైలం ఖరీజు ఖాతాలో పొరపాటుగా నమోదు చేశారని చెప్పారు. ఈ విషయంపై గ్రామంలో నిర్వహించిన భూ భారతి సమావేశంలో లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం కలెక్టర్ ఆదర్శ్ సురభి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆయన ఆదేశానుసారం ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఎమ్మార్వో శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది ఇటీవల గ్రామానికి వచ్చి విచారించారు. శ్రీశైలం ఖరీజు ఖాతాగా నమోదైన 7.26 గుంటల భూమిని నిశేధిత జాబితా నుంచి తొలగించారు. మంగళవారం ఆర్టీదారులకు పట్టాలను పంపిణీ చేశారు.