Share News

2.7 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - May 11 , 2026 | 11:13 PM

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి 2కిలోల 710 గ్రామాల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు

2.7 కిలోల గంజాయి పట్టివేత
స్వాధీనం చేసుకున్న గంజాయి, పట్టుబడిన నిందితులతో ఎక్సైజ్‌ అధికారులు

- పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు మహిళల అరెస్టు

- అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నరసింహారెడ్డి

జడ్చర్ల, మే 11 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి 2కిలోల 710 గ్రామాల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూ పరింటెండెంట్‌ నరసింహారెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్‌ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జడ్చర్ల కొత్తబస్టాం డు సమీపంలో ఆదివారం జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ విప్లవ్‌రెడ్డి, ఎస్‌ఐ కార్తీక్‌రెడ్డిల ఆధ్వర్యంలో రూట్‌వాచ్‌ నిర్వహించారని తెలిపారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. పశ్చి మబెంగాల్‌లోని మేడినిపూర్‌ గ్రామానికి వారు ఇద్దరు బాలానగర్‌ మండలంలోని హిందుస్థాన్‌ పరిశ్రమలో కూలీలుగా పని చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి వస్తూ రూ.30 వేలకు గంజాయిని కొని తీసుకువచ్చారని వివరించారు. 5 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్‌ను రూ. 300కు పోలేపల్లి సెజ్‌ ప్రాంతం, బాలానగర్‌, భూత్పూర్‌, మోతీఘనపూర్‌ తదితర ప్రాంతాలలో విక్రయించేందుకు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన జడ్చర్ల ఎక్సైజ్‌ ఎస్‌ఐ కార్తీక్‌రెడ్డి, కానిస్టేబుల్స్‌ సురేశ్‌, పద్మలను అభినందించారు. సమావేశంలో జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ విప్లవ్‌రెడ్డి, ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:13 PM