Share News

22ఏపై బీఆర్‌ఎస్‌ విషప్రచారాన్నితిప్పికొడదాం

ABN , Publish Date - Sep 11 , 2026 | 03:06 AM

22ఏ నిషేధిత భూముల జాబితాపై బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని అసెంబ్లీలో తిప్పికొడదామని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు చెబుదామన్నారు

22ఏపై బీఆర్‌ఎస్‌ విషప్రచారాన్నితిప్పికొడదాం
CM Revanth Reddy

  • అసెంబ్లీలో చర్చించి ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం

  • నిషేధిత భూముల జాబితా కేసీఆర్‌ హయాంలోదే

  • నాడు జరిగిన భూ దోపిడీని ప్రజల ముందుంచుదాం

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలపైనా చర్చిద్దాం

  • సభ సజావుగా జరగకుండా కేసీఆర్‌ కుట్ర చేశారు

  • పోలీసు సిబ్బందిలో కేటీఆర్‌కు నేను కనిపించినట్లున్నా..

  • అందుకే ఆక్రోశంతో వారి మీద దాడి చేశాడు

  • దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతు.. సర్‌ను సీరియ్‌సగా

  • తీసుకోండి.. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

  • కలిసి పనిచేస్తే కుట్రలను ఛేదించగలమని రుజువైంది: భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): 22ఏ నిషేధిత భూముల జాబితాపై బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని అసెంబ్లీలో తిప్పికొడదామని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు చెబుదామన్నారు. 22-ఏ జాబితా కొత్తగా వచ్చింది కాదని, కేసీఆర్‌ హయాంలో తీసుకొచ్చిందేనని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. అసెంబ్లీలో దీనిపై చర్చ నిర్వహించినప్పుడు.. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన భూ దోపిడీనీ బయటపెట్టనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో గురువారం జరిగిన సీఎల్పీ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు.. శాసనసభలో చర్చించనున్న అంశాలపైన సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహే‌ష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలు సజావుగా జరగకుండా కేసీఆర్‌.. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో కుట్ర చేశాడన్నారు. అధికారం పోయినా అహంకారం వీడని కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. పోలీసులను, ప్రజాప్రతినిధులను దూషిస్తూ మూడు రోజుల పాటు సభ జరగకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి వారికి ఇబ్బంది కలిగించారని, స్పీకర్‌ను అత్యంత అభ్యంతరకరంగా దూషించారని గుర్తు చేశారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ నిరసన చేపడితే.. దళితులు నడిచిన నేలను బీఆర్‌ఎస్‌ నేతలు శుద్ధి చేసి, వారిని అవమానించారన్నారు.


ఎస్‌ఐఆర్‌పై సీఎం మాట్లాడుతూ.. దేశంలో వయోజన జనాభా 103 కోట్లు ఉందని లెక్క తేల్చిన కేంద్ర ప్రభుత్వం.. ఓటరు జాబితాలో మాత్రం 88 కోట్ల మందినే చూపుతోందని పేర్కొన్నారు. అంటే, దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని.. ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లు భారీగా తొలగించే కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్కరూ అర్హులైనవారి ఓటును కాపాడే అంశాన్ని సీరియ్‌సగా తీసుకోవాలని సూచించారు. కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినవారు.. వన్‌ టైమ్‌ వండర్‌లుగా మిగిలిపోవద్దని, బాగా పని చేసి మరోమారు గెలిచి.. సీనియర్‌లు అనిపించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తుందన్నారు. తెలంగాణ కులగణనను నమూనాగా తీసుకుని.. దేశవ్యాప్త జనగణనలో కులగణననూ చేపట్టాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెద్దామన్నారు.

కేటీఆర్‌కు పోలీసు సిబ్బందిలో తాను కనిపించినట్లున్నానని, అందుకే అంత ఆక్రోశంగా వారి మీద దాడి చేశాడని రేవంత్‌ చమత్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎదిగిన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకే నష్టం చేయాలని చూస్తున్నారని తెలిపారు. జరిగిన ఘటనలపైన విచారణకు ఆదేశించామని సీఎం పేర్కొన్నారు. ఈ మూడు రోజుల్లో జరిగిన ఘటనలపైన ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నదానిపై ఫ్లాష్‌ సర్వే చేయించానని, అందరూ బీఆర్‌ఎస్‌ పార్టీనే తప్పు పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన కుట్రను బలంగా తిప్పికొట్టడమేగాక, ఆ కుట్ర గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేసినందుకు మంత్రులు, విప్‌లు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందిస్తున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగానే ఉందని, దీనిపైన సభలో చర్చ జరిపి ప్రజల్ని అప్రమత్తం చేద్దామని సీఎం పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రాజెక్టుల నుంచి పంటలకు నీళ్లు ఇవ్వాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయని, కానీ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రాజెక్టుల్లోని నీళ్లను తాగునీటి అవసరాలకు వినియోగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. విద్యుత్తుకూ డిమాండ్‌ పెరిగిందని, ప్రతిరోజూ 19,500 మిలియన్‌ యూనిట్ల వాడకం జరుగుతోందని వెల్లడించారు. కొందామన్నా కూడా కరెంటు దొరకటం లేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల అంశాలపైనా సభలో చర్చ నిర్వహిద్దామన్నారు.


కలిసి పని చేస్తే కుట్రలు ఛేదించగలం: భట్టి

బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రవర్తన, వారి భాష, శుద్ధీకరణ కార్యక్రమంపై కాంగ్రెస్‌ నేతలంతా కలిసికట్టుగా, సమర్థవంతంగా స్పందించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కలిసి పని చేస్తే కుట్రలను ఎలా ఛేదించగలమో చేసి చూపించామన్నారు. ఇకపైనా ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని, తగినంత ప్రచారం చేసుకోకపోవడం వల్లే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతోందన్నారు. సమర్థవంతంగా ప్రచారం నిర్వహిస్తే ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సోషల్‌ మీడియానూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఈ ప్రచార కార్యక్రమాన్ని పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఎస్‌ఐఆర్‌పై దృష్టి పెట్టాలి: మహేశ్‌గౌడ్‌

దేశంలో సర్‌ ప్రక్రియ దుర్మార్గంగా అమలవుతోందని, తమవి కావనుకున్న ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్రంలోనూ పెద్దసంఖ్యలో ఓట్లు పోతున్నాయని, ముఖ్యంగా దళితులు, గిరిజనుల ఓట్లు ఎక్కువగా తొలగిస్తున్నారని చెప్పారు. దీనిని నివారించటంపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్న అంశాలపై ఆయా శాఖల మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంపై ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జనగణన ప్రశ్నావళిలో బీసీ కాలమ్‌పై పొన్నం ప్రభాకర్‌, 22-ఏ పైపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాలిటెక్నిక్‌ కాలేజీల అంశంపై వివేక్‌ వివరించారు. ఆలిండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌గా నియమితులైన మధుయాష్కీగౌడ్‌ను సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం సన్మానించారు.

Updated Date - Sep 11 , 2026 | 03:06 AM