కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములు!
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:26 AM
చరిత్రలో ప్రజల కోసం పోరాటాలు చేసినవారు తమ ఆస్తులను కోల్పోతే.. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకొంటున్న కేసీఆర్ మాత్రం రూ.లక్ష కోట్ల విలువైన భూములను దోచుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పేరిట 9 జిల్లాల్లో 24 మండలాల్లోని 31 గ్రామాల్లో 440 ఎకరాల భూమి ఉందన్నారు.
ఫాంహౌస్‌లోనే 388 ఎకరాల ప్రభుత్వ భూమి బినామీల పేరుతో కొల్లగొట్టిన ఆ కుటుంబం
9 జిల్లాల్లో 440 ఎకరాల భూములున్నాయి
ఫాంహౌస్ భూములపై విచారణకు ఆదేశిస్తున్నా
ఆ భూముల్ని దళితులకిస్తా.. నెలలో పని పూర్తి
లేదంటే మంత్రి, అధికారులపై చర్యలు తప్పవు
కేటీఆర్ కుటుంబం పేరిట 123.19 ఎకరాలు
కవిత కుటుంబం పేరిట 37.26..
హరీశ్‌రావు కుటుంబం పేరిట 30.16..
సంతోష్ కుటుంబ సభ్యుల పేర 79.20 ఎకరాలు
సిరిసిల్లలో 8వేల ఎకరాల భూమి కాజేశారు
మైహోమ్ రామేశ్వరరావు కేసీఆర్ బినామీ
ఎయిర్‌పోర్టు వద్ద మైహోమ్‌కు
విమానాశ్రయానికి ఉన్నన్ని భూములున్నాయి
అన్నీ ధరణిని అడ్డు పెట్టుకుని కొట్టేసినవే
దోపిడీదారులు నా కళ్లలోకి చూడటానికి కూడా
భయపడే పరిస్థితి తీసుకొస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): చరిత్రలో ప్రజల కోసం పోరాటాలు చేసినవారు తమ ఆస్తులను కోల్పోతే.. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకొంటున్న కేసీఆర్ మాత్రం రూ.లక్ష కోట్ల విలువైన భూములను దోచుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పేరిట 9 జిల్లాల్లో 24 మండలాల్లోని 31 గ్రామాల్లో 440 ఎకరాల భూమి ఉందన్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో కేసీఆర్ చెప్పాలన్నారు. ఇవే కాకుండా బినామీల పేరుతో వందల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు. ఆయన ఫాంహౌస్‌లోనే 388 ఎకరాల ప్రభుత్వ భూమిఉందన్నారు. కుటుంబ సభ్యుల పేరుతో, బినామీల పేరుతో వందల ఎకరాల భూములను కొల్లగొట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి విధ్వంసానికి పాల్పడ్డ కేసీఆర్ ముఠా.. 22ఏ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్ర చేస్తోందన్నారు. భూదోపిడీకి పాల్పడ్డ వారంతా జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వీరి దోపిడీని క్షమిస్తే భవిష్యత్తు తరాలు తమను క్షమించవన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో కలుపుకొన్న 388 ఎకరాలను దళితులకు పంచుతామని ప్రకటించారు.
బుధవారం 22ఏ పై అసెంబ్లీలో వివరణ ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబానికి చెందిన భూముల వివరాలను వెల్లడించారు. ఇది ఆరంభం మాత్రమేనని, పార్ట్-1 వివరాలే ఇప్పుడు వెల్లడించానని, బడ్జెట్ సమావేశాల్లో మరిన్ని వివరాలు బయట పెడతానని చెప్పారు. భూ దోపిడీకి పాల్పడి తప్పు చేసినవారు తన కళ్లలోకి చూసేందుకు కూడా భయపడేలా తమ ప్రభుత్వ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇంతలా కక్కుర్తి పడతారా?
కేసీఆర్, ఆయన భార్య పేరిట 67.13 ఎకరాల భూములు ఉన్నాయని సీఎం రేవంత్ తెలిపారు. ఇక కేటీఆర్, ఆయన భార్య, పిల్లల పేరిట 123.19 ఎకరాల భూమి ఉందన్నారు. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త పేరిట 37.26 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబ సభ్యుల పేరిట 30.16 ఎకరాలు, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట 79.20ఎకరాలు, నవీన్‌కుమార్, కొండల్‌రావు కుటుంబ సభ్యుల పేరుతో 101.14 ఎకరాలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. సీలింగ్ చట్టం ప్రకారం.. భార్య, భర్త, అవివాహిత పిల్లలు ఒక యూనిట్ అవుతారని, వారికి కుస్కి పొలం 54 ఎకరాలు, తరి పొలమైతే 27 ఎకరాలు ఉండాలని అన్నారు. కానీ, కేసీఆర్ వద్ద ఉన్న 67 ఎకరాలూ తరి పొలమేనన్నారు. కేటీఆర్ కుటుంబం పేరుతో ఉన్న 123.19 ఎకరాలు కూడా తరి పొలమేనని తెలిపారు. కేసీఆర్ ఇంత కక్కుర్తికి పాల్పడతారని తాను అనుకోలేదని రేవంత్ అన్నారు. కేసీఆర్ లో పట్టా భూమిగా 295ఎకరాలు చూపిస్తే.. ప్రభుత్వ భూమి 388 ఎకరాలు ఉందన్నారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఈ భూమిని కొట్టేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి 30రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీసీఎల్‌ఏ లోకేశ్‌కుమార్, కలెక్టర్‌ను ఆదేశించారు. జాప్యం జరిగితే మంత్రితోపాటు అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనన్నారు. 388 ఎకరాల ప్రభుత్వ భూమిని 850 దళిత కుటుంబాలకు పంపిణీ చేసి పట్టాలిస్తానని ప్రకటించారు.
జన్వాడ్ ఫాంహౌస్ కు భూములెలా వచ్చాయి?
ఐటీ శాఖ అటాచ్ చేసిన సత్యం రామలింగరాజు భూములను కేటీఆర్ స్వాధీనం చేసుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. లేదంటే జన్వాడ ఫాంహౌస్‌కు భూములు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. రంగనాయక్ సాగర్ వద్ద భూ సేకరణ చేసిన భూములను హరీశ్‌రావు కొట్టేశారని, ఆయన ఫాంహౌ్‌సకు రూ.5.30కోట్ల మున్సిపల్ నిధులతో రోడ్డు వేయించుకున్నారని చెప్పారు. ఈ భూములను ఎలా దక్కించుకున్నారో హరీశ్‌రావు చెబుతారా? లేక ఈడీ కేసును ఎదుర్కొంటారో చెప్పాలన్నారు. కొమరం భీం నుంచి అందెశ్రీ, గద్దర్, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మభిక్షం.. ఇలా ఎవరి వద్దా ఇంచు భూమి కూడా లేదని, కేసీఆర్ కుటుంబం వద్దనే 440ఎకరాల అర్బన్ సీలింగ్ భూములున్నాయని ధ్వజమెత్తారు. ఏ వ్యాపారం చేసి ఇన్ని భూములు సంపాదించారని ప్రశ్నించారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల కొల్లగొట్టారని, 440 ఎకరాల పత్రాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 2023లో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50కోట్ల విలువైన భూములను రూ.1.53 కోట్లకే కట్టబెట్టారని తెలిపారు. ఎయిర్‌పోర్టు వద్ద మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి 47 ఎకరాలు ఉంటే.. అందులో 11 ఎకరాలు ఇనాం భూములే ఉన్నాయన్నారు. గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సుధీర్‌రెడ్డి బహదూర్‌గూడలో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను హైస్పీడ్ రైల్ కారిడార్‌కు తీసుకుంటుంటే నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఇష్టమైన ఓ అక్క కూడా వీరికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ భూములపై విచారణ చేయమని ఆ అక్క లేఖ రాయగలరా? అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సొంత గ్రామం తిమ్మాపూర్‌లో 14 సర్వే నంబర్ల పరిధిలో 77 ఎకరాల భూదాన్ భూమి ఇతరుల పేరుమీదకు బదిలీ అయిందని తెలిపారు. గోల్ట్‌స్పాట్ ప్రసాద్‌కు మియాపూర్‌లో సీఎస్ 7, సీఎస్ 14 పరిధిలో ఉన్న భూములను కట్టబెట్టారని చెప్పారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయన సోదరుడి కంపెనీ ట్రినిటీ ఇన్‌ఫ్రా నుంచి బెంజ్ కార్ల లబ్ధిగా పొందారని ఆరోపించారు. భూ అక్రమాలకు పాల్పడిన వారందరినీ లోపల వేస్తానని హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య కూడా వీఏఎఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో 10ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్ బినామీ అయిన ప్రతిమ కనస్ట్రక్షన్స్‌కు చెందిన బి.శ్రీనివాసరావుకు వట్టినాగులపల్లిలో ప్రభుత్వ భూములను కట్టబెట్టారని చెప్పారు. భూపాలపల్లిలో 106 ఎకరాలు, సిరిసిల్లలో 8000 ఎకరాలను కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీల పేర్లతో బదలాయించారని ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టర్ ఏడుగురి మీద కేసులు పెట్టి 2400ఎకరాలను రికవరీ చేశారని తెలిపారు.
మైహోమ్‌కు ఎయిర్‌పోర్టుకున్నంత భూమి
మైహోమ్ రామేశ్వరరావు.. కేసీఆర్ బినామీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సభలో వెల్లడించారు. రామేశ్వరరావు శంషాబాద్‌లో 2,645 ఎకరాల భూదాన్, అసైన్డ్, వక్ఫ్ భూములను 23 కంపెనీల పేరిట కొనుగోలు చేశారని తెలిపారు. ఇదంతా ఎయిర్‌పోర్టుకు ఆనుకుని, ఎయిర్‌పోర్టుకు ఉన్నంత ఉందని పేర్కొన్నారు.
ఆయన ఎవరి బినామీ అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు కన్నా ఎక్కువ విస్తీర్ణంలో భూములను ముచ్చింతల్, పాలమాకుల, మదనపల్లి, తూప్రాన్, వెంకన్నగూడలో వివిధ కంపెనీల పేరిట కొనుగోలు చేశారని, గొల్లూరు గ్రామంలో 1994 నుంచి 2023 వరకు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ల నుంచి 301.07 ఎకరాల భూమిని కొన్నారని, తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో ఆ సర్వే నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. నాగారం గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 315 ఎకరాలు తొలగించారని చెప్పారు. ఇదే కాకుండా.. కాప్రాలో సైతం ఎవక్యూ ప్రాపర్టీ భూ దందాకు పాల్పడ్డారని తెలిపారు. ముందుగా వారి కరపత్రికలో ఎవక్యూ భూములు ప్రభుత్వ భూములంటూ కథనం రాయించారని, ఆంద్రోళ్లు వచ్చి తమ భూములను కొల్లగొడుతున్నారం టూ ప్రచారం చేసి, వాళ్లను భయపెట్టించి ఆ భూములు మొత్తం మైహోమ్‌కు బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ను కొల్లగొట్టడంతోనే వీరి అక్రమాలు ఆగలేదని, మేళ్లచెరువులో భూదాన్ భూములనూ చెరబట్టారని సీఎం తెలిపారు. మై హోమ్ సిమెంట్స్ కంపెనీ భూదాన్ భూములను అక్రమంగా సొంతం చేసుకుందని, ఆ కంపెనీకి ఉన్న మొత్తం 242 ఎకరాల్లో 113 ఎకరాలు భూదాన్ భూములుగా లెక్క తేలిందని వెల్లడించారు. ఇవి ఆ కంపెనీకి ఎలా చేరాయని ప్రశ్నించారు. గద్దల కన్నా అధ్వానంగా ప్రభుత్వ భూములను కొట్టేశారని, దోపిడీ చేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
వారి అవినీతి చర్చకు వస్తుందనే..
ధరణిలో జరిగిన అవినీతి అక్రమాలపై స్పెషల్ ఎంక్వైరీ టీం(ఎస్ఈటీ)తో విచారణ జరుగుతోందని సీఎం రేవంత్ తెలిపారు. దీంతో రూ.లక్ష కోట్ల భూములను కొల్లగొట్టిన విషయం చర్చకు వస్తుందని సభలోకి రాకుండా పారిపోయారని అన్నారు. ఇందుకోసం అధికారులను, మహిళలను దూషించి, దాడి చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని వారి వైఖరిని సభ ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. ఇన్నాళ్లు జరిగిన ప్రతి దోపిడీ వెనుక ధరణి వారి చేతుల్లో ఉండటమే కారణమన్నారు. కొత్త సాఫ్ట్‌వేర్ తెచ్చుకోవడంలో జాప్యం జరగడం, ధరణి మాడ్యూల్ విదేశాల్లో ఉండటంతో.. వారు ఒక్క క్లిక్ కొడితే మొత్తం కొలాప్స్ అవుతుందని భావించి కొంత సంమయనం పాటించామని తెలిపారు. నెలన్నర రోజుల్లో కొత్త మాడ్యూల్‌ను తీసుకొస్తున్నామన్నారు. శిశుపాలుడికైనా 99 తప్పుల వరకు శిక్ష పడలేదని, నూరో తప్పుతో తలకాయ తెగిందని అన్నారు. ఏ దుర్మార్గుడికైనా సమయం వస్తుందని, అప్పుడే కోర్టులు శిక్షలు విధించాలని కోరారు. ఇంత దోపీడీ, విధ్వంసం, అరాచకానికి పాల్పడిన వారిని క్షమిస్తే భవిష్యత్తు తరాలు మనలను క్షమించవని సీఎం అన్నారు. ధరణితోపాటు సభ్యులు లేవనెత్తిన వివిధ విషయాలన్నింటినీ ఎస్‌ఈటీకి రిఫర్ చేస్తున్నామని తెలిపారు. వారి అక్రమాలో టీజీఐఐసీ భూములు, ఇతర భూములు కూడా ఉన్నాయని, వారిని ఇక్కడ కూర్చోబెట్టి అన్నీ చెబుతానని అన్నారు. తన కళ్లలోకి చూడటానికి కూడా వారికి ధైర్యం రావద్దన్నారు. వారు చేసిన దోపిడీకి తలవంచుకుని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిని ప్రత్యక్షంగా తీసుకుని వస్తానని, అందుకే తప్పించుకుని తిరుగుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. నిజాం సర్కార్ ఇచ్చిన భూములను ఒకే కుటుంబం దోచుకుందని, నిలబడి వసూలు చేస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
90 మంది ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడ్డారు: బండి సంజయ్
బీజేపీతో పొత్తుపై కేటీఆర్ క్లారిటీ.. ఏమన్నారంటే