తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను కబ్జా చేసే యత్నం
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:44 AM
మతం గురించి మాట్లాడకుండా ఆర్‌ఎస్ఎస్, బీజేపీలకు క్షణమైన గడవదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలదీశారు. భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులమడం ఏమిటన్నారు
ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన పటేల్‌ను
మీ నేత అని ఎలా చెప్పుకొంటారు?
బీజేపీపై కూనంనేని విమర్శలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మతం గురించి మాట్లాడకుండా ఆర్‌ఎస్ఎస్, బీజేపీలకు క్షణమైన గడవదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలదీశారు. భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులమడం ఏమిటన్నారు. హైదరాబాద్ స్వాతంత్రోద్యమంలో ప్రజలు మతాలకు, కులాలకు అతీతంగా పాల్గొన్నారని.. మగ్దూం, షోయబుల్లాఖాన్, సయ్యద్ ఇబ్రహీం, జావెద్ రిజ్వీ లాంటి నాయకులెంతోమంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని గుర్తుచేశారు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉద్యమ చరిత్రకు బీజేపీ మతం రంగు పులిమేందుకు, తద్వారా ఆ చరిత్రను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సీపీఐ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ హత్యానంతరం నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆర్‌ఎస్ఎస్ నిషేధించారని, అటువంటి పటేల్‌ను తమ నాయకుడు అంటూ సంఘ్ పరివార్ ఎలా సొంతం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్‌కు రాజ్‌ప్రముఖ్‌గా నియామక పత్రాలు అందచేసింది కూడా పటేల్ అనే విషయమైనా తెలుసా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
సెప్టెంబరు 17ను రేవంత్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కీర్తిని మసకబారేలా చేస్తుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని కూనంనేని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ, ఉపరాష్ట్రపతితో అబద్ధాలు చెప్పించే స్థాయికి దిగజారిందంటూ సీపీఐ జాతీయ నేత నారాయణ ఘాటుగా విమర్శించారు. ట్రంప్‌నకు మోదీ బానిసగా మారితే, మోదీకి చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కేటీఆర్ బానిసలుగా వ్యవహరిస్తున్నారన్నారు. మరోవైపు, జూబ్లీహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియం మొదటి అంతస్తులో తెలంగాణ సాయుధ పోరాట చిత్రాలు, అరుదైన ఛాయాచిత్రాలతో శాశ్వత గ్యాలరీని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, పరకాల ప్రభాకర్, సీపీఎం కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రారంభించారు.