కృష్ణా జలాలు రంగు మారాయ్!!
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:40 AM
నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టుల వద్ద కృష్ణా జలాలు రంగు మారాయి. ఆయా ప్రాజెక్టుల్లోని నీళ్లు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల వద్ద ఆకుపచ్చ రంగులో నీళ్లు
నాచు వల్లనే అంటున్న అధికారులు
గద్వాల, నాగార్జునసాగర్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టుల వద్ద కృష్ణా జలాలు రంగు మారాయి. ఆయా ప్రాజెక్టుల్లోని నీళ్లు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్యం వల్లే నీళ్లు రంగు మారాయనే వాదనలు అధికమయ్యాయి. అయితే, నీళ్లు రంగు మారడానికి కాలుష్యం కారణం కాదని ఆ నీళ్లను పరీక్షించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. నాచు వల్లే నీళ్లు రంగుమారాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా జూరాల ప్రాజెక్టు వద్ద నీళ్లు తొలిసారి ఆకుపచ్చగా మారాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవ్వగా.. ఇరిగేషన్ డీఈ నాగేశ్వర్‌రావు శుక్రవారం ఓ పడవలో ప్రాజెక్టు మధ్యలోకి వెళ్లి నీళ్లను పరిశీలించారు. దాదాపు 30 నుంచి 40 శాతం నీళ్లు కలుషితం అయినట్లు గుర్తించారు. అక్కడి నీటిని సేకరించి పరీక్షలకు పంపారు. ఈ ఫలితాలు ఇంకా రాలేదు. మరోపక్క, నీటి కాలుష్యం వల్ల చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు చేస్తోన్న ఆరోపణలను డీఈ నాగేశ్వర్‌రావు ఖండించారు. చేపల మృతికి కాలుష్యం కారణమని తేల్చేందుకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. అంతేకాక ప్రాజెక్టు లోపల ఉన్న చేపలకు ఆక్సిజన్ కొరత లేదన్నారు. అలాగే, జూరాలలోని నీటిని పరిశీలించిన మిషన్ భగీరథ అధికారులు.. నీళ్లలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని తెలిపారు. ఇక, నాగార్జున సాగర్ సమీపంలోని దయ్యాలగండి వద్ద బ్యాక్‌వాటర్ ఇటీవల ఆకుపచ్చగా మారాయి. దీంతో ఆందోళన వ్యక్తమవ్వగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ నీటిని పరీక్షించారు. నీళ్లలో ఎలాంటి రసాయనాలు లేవని తెలిపారు. ఇంతలోనే నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ వద్ద నీళ్లు గురువారం ఆకుపచ్చగా కనిపించాయి. నీరు ఆకుపచ్చగా మారడానికి ప్రధాన కారణం అడుగున ఉన్న నాచు పైకి రావడమేనని ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు తెలిపారు.