రక్షాబంధన్..!
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:29 AM
రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు
సీఎం రేవంత్‌కు బంగారు రాఖీ కట్టిన మంత్రి సురేఖ
మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కొండా
ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రికి
మరింత శక్తి, యుక్తి కలగాలి: కొండా సురేఖ
రాఖీ వేరు.. రచ్చ వేరు
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. మరో మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన మంత్రి సురేఖ.. బంగారంతో ప్రత్యేకంగా చేయించిన రాఖీని రేవంత్‌కు కట్టారు. ఇద్దరు మహిళా మంత్రులు సీఎంకు రాఖీ కట్టిన సమయంలో అక్కడ సీఎం సతీమణి, కుమార్తె ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ కొద్దిరోజుల క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో పెద్ద దుమారం రేపడం, సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అధిష్ఠానానికి సిఫారసు చేయడం తెలిసిందే. కాగా, సీఎంపై సుస్మితా పటేల్ విమర్శలు చేసిన సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పలువురు మంత్రులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినా.. కొండా సురేఖ మాత్రం కలవలేదు.
ఈ నేపథ్యంలో సురేఖ సీఎంకు రాఖీ కట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి ఆమె సీఎంకు రాఖీ కడతారా? లేదా? అన్న ఆసక్తి ఇటు రాజకీయ వర్గాలతోపాటు అటు రాష్ట్ర ప్రజల్లోనూ నెలకొంది. వీటన్నింటికీ తెరదించుతూ కొండా సురేఖ ఎప్పటిలాగే సీఎంకు రాఖీ కట్టారు. అయితే గత ఏడాది తన కూతురు సుస్మితా పటేల్‌ను వెంటబెట్టుకుని వెళ్లి సీఎంకు రాఖీ కట్టిన సురేఖ.. ఈసారి మాత్రం మంత్రి సీతక్కతో కలిసివెళ్లారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన అంశాలపై సీఎంతో ఆమె చర్చించినట్లు తెలిసింది. మరోవైపు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, బ్రహ్మకుమారీస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, మలక్‌పేటలోని అంధ బాలికల పాఠశాల విద్యార్ణినులు, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన జొన్నల శ్వేత పవన్ అనే మహిళ, అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఆడపడుచులకు సీఎం ఆశీర్వాదం ఉండాలి: మంత్రి కొండా సురేఖ
తాను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా మూడోసారి ముఖ్యమంత్రికి రాఖీ కట్టానన్నారు. ఆయన అల్లుడికి, మనవడికి కూడా రాఖీ కట్టానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిపై రాష్ట్రంలోని ఆడపడుచులందరి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులందరికీ ముఖ్యమంత్రి ఆశీర్వాదం ఉండాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎంకు మరింత శక్తి, యుక్తి కలగాలని ఆకాంక్షించారు. తాను తెలంగాణ ఆడపడుచునని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తనను వారి కుటుంబ సభ్యురాలిగా ఆదరిస్తుందని పేర్కొన్నారు. పండుగ లాంటి వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు.
రాఖీ వేరు.. రచ్చ వేరు
మంత్రి కొండా సురేఖ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టడంతో.. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందా! అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సురేఖతో రాఖీ కట్టించుకోవడం ద్వారా వివాదానికి సీఎం ముగింపు పలికినట్లేనా.. అన్న చర్చ జరిగింది. అయితే అధిష్ఠానం నేతలు, మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం ‘రాఖీ వేరు.. రచ్చ వేరు’ అని అంటున్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందిగా టీసీసీసీ ఇప్పటికే అధిష్ఠానానికి నివేదిక పంపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో ఆమెపై చర్యల అంశం ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కోర్టు నుంచి హైకమాండ్ వద్దకు చేరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చేతికి రాఖీ కట్టడం.. సయోధ్యకు బాటలు పడ్డట్లు కూడా కాదని పేర్కొంటున్నాయి. రాఖీ కట్టిన సమయంలో వారిద్దరి మధ్య చర్చలు జరిగాయన్నది కూడా అవాస్తవమని అంటున్నాయి. కొండా సురేఖ దంపతుల అండదండలతోనే వారి కుమార్తె సుస్మిత గతంలో ఓసారి, తాజాగా మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఆమెపై చర్యలు తీసుకోకుండా.. రాఖీతో వివాదాన్ని సమసిపోయేలా చేస్తే పార్టీలో క్రమశిక్షణ పట్టు తప్పుతుందని స్పష్టం చేస్తున్నాయి. పార్టీని, నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని, రాఖీతో వివాదం సమసిపోదని అంటున్నాయి.