Share News

‘కొడంగల్ బిడ్డను’ అంటూ.. సొంత నియోజకవర్గంలో ఇళ్ల కూల్చివేతలు: హరీశ్ రావు ఫైర్

ABN , Publish Date - Sep 29 , 2026 | 01:46 PM

కొడంగల్ నియోజకవర్గం మద్దూరులో పేదల ఇళ్ల కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేశారంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే..

‘కొడంగల్ బిడ్డను’ అంటూ.. సొంత నియోజకవర్గంలో ఇళ్ల కూల్చివేతలు: హరీశ్ రావు ఫైర్
Kodangal House Demolitions

కొడంగల్, సెప్టెంబర్ 29: నియోజకవర్గంలోని మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగించడంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా నిలదీశారు. ‘కొడంగల్ బిడ్డను’ అని చెప్పుకొంటూ సొంత నియోజకవర్గ ప్రజల ఇళ్లనే కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. కనీస నోటీసులు ఇవ్వకుండా.. న్యాయస్థానాల తీర్పులను సైతం లెక్కచేయకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న ఈ బుల్డోజర్ రాజ్ ప్రజాపాలన అనిపించుకోదని మండిపడ్డారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలను అర్ధరాత్రి రోడ్డున పడేయడం అత్యంత కర్కశమని ధ్వజమెత్తారు.


అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం బాధితులకు తక్షణమే బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే యూపీఏ హయాంలోని భూసేకరణ చట్టం–2013 ప్రకారం ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి న్యాయమైన పరిహారం, మెరుగైన పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. పేదల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యలను బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధితులకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ వార్తలూ చదవండి

గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్

కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ

Updated Date - Sep 29 , 2026 | 02:15 PM