అకాల వర్షం.. అన్నదాతకు తీరని శోకం
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:16 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ....
నిర్మల్, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు నేలపాలు
వేల ఎకరాల్లో మొక్కజొన్న నష్టం
వందల ఎకరాల్లో శనగ, మిర్చి పంటలకు దెబ్బ
హైదరాబాద్/ముథోల్/ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం/చందంపేట/మేళ్లచెర్వు/కేతేపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ముఖ్యంగా నిర్మల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం ఈ వర్షం మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. నిర్మల్ జిల్లా లో అకాల వర్షం వడగళ్లతో విరుచుకుపడింది. జిల్లావ్యాప్తంగా 2,600ల ఎకరాల్లో మొక్కజొన్న, వందల ఎకరాల్లో శనగ పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఖానాపూర్, మామడ, సోన్, లక్ష్మణచాంద, భైంసా, ముథోల్ తదితర మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న శనగ కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కూలీల కొరతతో పంట కోయలేని రైతులు, ఇప్పుడు కళ్లముందే పంట పాడవ్వడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం జిల్లాలో 13 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యథికంగా వైరాలో 89 మి.మీ. వర్షం కురింసింది. బోనకల్, కొణిజర్ల, సత్తుపల్లి తదితర మండలాల్లోనూ భారీ వర్షం నమోదైంది. దీంతో పలు చోట్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. పూత దశలో ఉన్న మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిచింది. మరోవైపు, ఉమ్మడి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురిసిన వర్షం ఒకరికి కష్టం, మరొకరికి ఊరటనిచ్చింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షానికి తడిసిపోయింది. వరి పంట కూడా అక్కడక్కడా నేలకొరిగింది. చందంపేట మండలంలో 7సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం వేరుశనగ, వరి పంటలకు ప్రాణం పోసింది. కొద్దిరోజులుగా విద్యుత్ కో తలతో ఎండిపోతున్న పంటలకు వాన ఊరటనిచ్చిందని, మరో 10 రో జుల వరకు నీటిఅవసరం ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, బుధవారం నుంచి ఎండ తీవ్రత కూడా పెరగనున్నట్లు హెచ్చరించింది. సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నిర్మల్, జగిత్యాల, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు ఎండ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో 35 డిగ్రీలకు పైనే పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.