గణేశ్ శోభాయాత్రతో ట్రాఫిక్‌జామ్.. సమయానికి ఆస్పత్రికి వెళ్లలేక బాలుడి మృతి
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:46 AM
విషజ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా గణేశ్ శోభాయాత్రతో ట్రాఫిక్ జామ్ ఏర్పడంటతో ఆలస్యమై ఆ చిన్నారి మృతిచెందాడు.
బోనకల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విషజ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా గణేశ్ శోభాయాత్రతో ట్రాఫిక్ జామ్ ఏర్పడంటతో ఆలస్యమై ఆ చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా బోనకల్ ఎస్టీ కాలనీకి చెందిన భూక్యా సైదులు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు వైభవ్‌నాయక్ (2) నాలుగురోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. అతడిని మొదట ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి ఆస్పత్రిలో చేర్చగా ఆరోగ్యం విషమించటంతో గురువారం ఖమ్మం పాతబస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని జెడ్పీసెంటర్ సమీపంలో ఉన్న మరో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ మార్గంలో అదే సమయంలో వినాయకుడి ఊరేగింపు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బాలుడిని అతడి తండ్రి భుజాలపై వేసుకుని ఆస్పత్రికి నడుచుకుంటూ తీసుకెళ్లాడు. కానీ, అప్పడికే ఆ చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో వైభవ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.