Share News

కాంగ్రెస్‌, సీపీఐ ఎవరికి వారే..

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:01 AM

అసెంబ్లీ ఎన్నికల నుంచి మిత్రపక్షాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్‌, సీపీఐలు.. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న....

కాంగ్రెస్‌, సీపీఐ ఎవరికి వారే..

  • మునిసిపల్‌ ఎన్నికల్లో కుదరని పొత్తు.. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు ఒప్పుకోని కాంగ్రెస్‌

  • మొత్తం 60 డివిజన్లలో సీపీఐ అభ్యర్థుల నామినేషన్లు

  • ఉమ్మడి ఖమ్మంలో సీపీఎంతో కాంగ్రెస్‌ దోస్తీ

  • అన్ని చోట్లా కొత్త మిత్రుడితో కలిసి పోటీ

  • వైరాలో భట్టి, పొంగులేటి వర్గాల పోటాపోటీ నామినేషన్లు

ఖమ్మం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల నుంచి మిత్రపక్షాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్‌, సీపీఐలు.. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఈ పార్టీల మధ్య పొత్తు కుదరకపోవటంతో ఇతర చోట్ల కూడా ఎవరికి వారే నామినేషన్లు వేశారు. 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెంలో సీపీఐ 30 డివిజన్లు ఇవ్వాలని కోరగా, కాంగ్రెస్‌ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసింది. చివరకు 25 డివిజన్లు అయినా ఇవ్వాలని సీపీఐ కోరినా.. కాంగ్రెస్‌ ఒప్పుకోలేదు. దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావటంతో సీపీఐ అభ్యర్థులు మొత్తం 60 డివిజన్లలోనూ నామినేషన్లు వేశారు. కొందరు టీడీపీ సానుభూతిపరులు కూడా సీపీఐ తరఫున నామినేషన్లు వేసినట్టు తెలిసింది.

సీపీఐతో స్నేహం చెడిపోవటంతో కాంగ్రెస్‌ పార్టీ సీపీఎంతో జట్టు కట్టింది. కొత్తగూడెంలో సీపీఎం రెండుచోట్ల నామినేషన్లు వేసింది. మిగిలిన చోట్ల కాంగ్రె్‌సకు మద్దతిస్తోంది. ఇల్లెందులో కూడా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో సీపీఐ 6 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఇక్కడ సీపీఎంకు కాంగ్రెస్‌ ఒక వార్డు కేటాయించింది. అశ్వారావుపేటలో సీపీఎం ఒక వార్డులో.. మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ నామినేషన్లు వేశాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మునిసిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా, సీపీఐ అభ్యర్థులు 15 వార్డుల్లో నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ 32 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో 22 వార్డులుండగా.. పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల, కాంగ్రెస్‌ అన్నిచోట్లా నామినేషన్లు వేశాయి. వైరా మునిసిపాలిటీలో కాంగ్రె్‌సలోనే భట్టి, పొంగులేటి వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు వేశాయి. ఇక్కడ సీపీఐ మూడు వార్డుల్లో రంగంలోకి దిగింది. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మునిసిపాలిటీలో సీపీఐ ఒకచోట నామినేషన్‌ వేసింది. సత్తుపల్లి మునిసిపాలిటీలో కూడా కాంగ్రెస్‌, సీపీఐ సొంతంగానే పోటీ చేస్తున్నాయి. ఇక్కడ సీపీఐ అభ్యర్థులు రెండుచోట్ల నామినేషన్లు వేశారు. అయితే, నామినేషన్ల ఉపసంహరణ నాటికి చర్చలు ఫలిస్తే కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తులు పొడిచే అవకాశమూ లేకపోలేదని ఇరు పార్టీల నేతలు అంటున్నారు.

Updated Date - Jan 31 , 2026 | 04:01 AM