Share News

పెళ్లికి నిరాకరించడంతోనే..

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:41 AM

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య కేసు మిస్టరీ వీడింది!

పెళ్లికి నిరాకరించడంతోనే..
harini

  • హరిణిని చంపింది ప్రియుడు పవనే.. వీడిన నర్సింగ్‌ విద్యార్థిని హత్య కేసు మిస్టరీ

  • నిందితుడిఅరెస్టు.. నేరాంగీకారం

  • నాలుగేళ్లుగా ఇద్దరూ ప్రేమలో..

  • కుటుంబాల మధ్య గొడవల

కారణంగా పెళ్లికి పెద్దల నిరాకరణ

  • మరో వ్యక్తితో హరిణి చనువుగా

ఉంటోందని కక్ష పెంచుకున్న పవన్‌

జూలూరుపాడు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య కేసు మిస్టరీ వీడింది! అనుమానించినట్టే అదే గ్రామం, అదే కాలనీకి చెందిన దేవరకొండ పవన్‌ కుమారే నిందితుడని పోలీసులు తేల్చారు. తనను ప్రేమించిన హరిణి, పెళ్లి ప్రతిపాదన తెచ్చేసరికి నిరాకరించడం, పైగా ఆమె మరొకరిని ఇష్టపడుతుండటంతో కక్ష పెంచుకున్న పవన్‌, ఆమె మెడకు బైక్‌ క్లచ్‌ వైరును బిగించి, కాళ్లు లాగి తలకు గాయం చేసి చంపాడు. జూలూరుపాడు పీఎ్‌సలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. హరిణి, పవన్‌ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనీ అనుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య గతంలోనే గొడవలు ఉండటంతో హరిణి, పవన్‌ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కొన్నాళ్లు దూరంగానే ఉన్నా పవన్‌, హరిణి వెంటబడి మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. పవన్‌ తీరు సరిగా లేకపోవడం, పైగా చెడు అలవాట్ల కారణంగా అతడిని హరిణి దూరం పెడుతూ వచ్చింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీని కూడా మార్చుకుంది. ఇక్కడి నుంచి పవన్‌, హరిణి మఽధ్య గొడవలు మొదలయ్యాయి. హరిణి మరో యువకుడితో ప్రేమలో ఉందని అనుమానించిన పవన్‌ ఆమెపై మరింత కోపం పెంచుకున్నాడు. గత నెల 3న మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఫొటోలు దిగిందని తెలుసుకుని తన అనుమానం నిజమేనని నిర్ధారించుకున్నాడు. గత నెల 21న హరిణి కొత్తగూడెంలోని తన పిన్ని కవిత ఇంటి నుంచి వెంగన్నపాలెంలోని తన ఇంటికొచ్చింది. మర్నాడు పవన్‌ ఫోన్‌ చేసినా హరిణి కట్‌ చేసింది.


అదే రోజు మధ్యాహ్నం 3:20కు హరిణి తల్లి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లగా.. గమనించిన పవన్‌, హరిణి ఇంట్లోకొచ్చాడుఇంటి వెనుక డాబా మెట్ల వద్ద ఉన్న హరిణితో తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతోవారి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే కోపంతో ఉన్న పవన్‌.. వెంట తెచ్చుకున్న బైక్‌ క్లచ్‌ వైరుతో హరిణి మెడకు గట్టిగా బిగించాడు. ఆమె చనిపోయిందనుకొని కాళ్లు పట్టుకొని లాగడంతో తల నేలకు బలంగా తగలడంతో తీవ్ర గాయమై హరిణి మృతిచెందింది. ఆ తర్వాత ఆమెను పవన్‌ మరుగుదొడ్డి వెనక భాగంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. బంధువుల ఇంటికి వెళ్లిన హరిణి తల్లి రాజేశ్వరి తన కూతురు ఏం చేస్తుందో చూసి రమ్మని బంధువుల అమ్మాయిని ఇంటికి పంపగా తలుపులు పెట్టి ఉండటంతో ఆ అమ్మాయి గమనించింది. ఎంత సేపు కొట్టినా తలుపులు తీయకపోవడంతో ఆమె వెళ్లి హరిణి తల్లికి విషయం చెప్పింది. దాంతో రాజేశ్వరి ఇంటికొచ్చి చూడగా మరుగుదొడ్డి వెనుకభాగంలో కూతురు మృతదేహం కనిపించింది. తన బిడ్డను అదే కాలనీకి చెందిన పవన్‌ పెళ్లిచేసుకోవాలని కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అందుకు తన కూతురు నిరాకరించడంతోనే హత్య చేశాడంటూ పోలీసులకు రాజేశ్వరి ఫిర్యాదు చేసింది. పోస్ట్‌మార్టం నివేదికలో యువతి హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యింది. మరోవైపు పవన్‌, తన సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి విశాఖపట్నం, తిరుపతి వెళ్లి తిరిగి ఖమ్మం చేరుకున్నాడు. తన ద్విచక్ర వాహనాన్ని జూలూరుపాడు నుంచి ఒంటిగుడిసె వెళ్లే రహదారి మధ్యలో గల సీతారామ కెనాల్‌ వద్ద పెట్టి వెళ్లాడు. ర్యాపిడోలో పనిచేయాలని నిర్ణయించుకున్న పవన్‌ తన బైకుకోసం సీతారామ కెనాల్‌ వద్దకు రాగా అప్పటికే ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేశారు. పెళ్లికి నిరాకరించడంతోనే హరిణిని చంపినట్లు నిందితుడు చెప్పాడని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

Updated Date - Oct 02 , 2026 | 06:41 AM