Share News

వెయ్యేళ్లయినా బీఆర్‌ఎస్‌ మారదు

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:54 AM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పైరయ్యారు. ముఖ్యంగా జగిత్యాల వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన సభపై తీవ్ర విమర్శలు చేశారు.

వెయ్యేళ్లయినా బీఆర్‌ఎస్‌ మారదు

  • ఓటమికి ఆత్మవిమర్శ చేసుకోకుండా నేటికీ ప్రజలనే బద్నామ్‌ చేస్తారా ?

  • వృద్ధుడిని పార్టీలో చేర్చుకొని పునర్నిర్మాణ యజ్ఞమా?

  • బీఆర్‌ఎస్‌ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్‌ పార్టీవి పిట్టకథలు: కవిత

  • 25న పార్టీ ఆవిర్భావోత్సవానికి రావాలని ప్రజలకు పిలుపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పైరయ్యారు. ముఖ్యంగా జగిత్యాల వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన సభపై తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల సభలో ఓ వృద్థుడిని పార్టీలో చేర్చుకొని తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెబుతున్నారంటే... వెయ్యేళ్లయినా సరే బీఆర్‌ఎస్‌ మారదని కవిత విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఆలోచనా విధానాన్ని మేధావులు, విద్యావేత్తలు అర్థం చేసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ఉత్తి కథలు చెబుతుంటే, కాంగ్రెస్‌ పార్టీ పిట్ట కథలు చెబుతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమిపై బీఆర్‌ఎస్‌ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, ప్రజలే తప్పు చేశారంటూ నేటికీ ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటమికి ప్రజలే కారణమని ఇప్పటికీ వారినే బద్నామ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. 75 ఏళ్లు వృద్ధుడిని పార్టీలో చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని, ఆయనకు 25 ఏళ్ల తగ్గిపోయాయని, నవ యువకుడని అంటున్నారని ఎద్దేవా చేశారు. జీవన్‌ రెడ్డిని యువకుడంటే రాష్ట్రంలోని యువత పరిస్థితేంటి అని ప్రశ్నించారు. తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండుసార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు వైఎస్‌ నాయకత్వం ఉంటే చాలని, ప్రత్యేక రాష్ట్రం ఎందుకని ప్రశ్నించిన వ్యక్తి జీవన్‌ రెడ్డి అని గుర్తు చేశారు. అలాగే, ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తి జీవన్‌రెడ్డి అని చెప్పారు. జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ నాయకత్వం పల్లెత్తు మాట అనకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని కవిత ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకేరోజు భారీ బహిరంగ సభలు పెట్టి బలప్రదర్శనకు దిగాయని, ప్రజా సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.


గుంట నక్కతో.. గుంపు మేస్త్రీ డీల్‌..!

ఢిల్లీలో ఎవరెవరిని కలిశారో చెప్పాలా ? అని బెదిరిస్తూ.. గుంట నక్కతో.. గుంపుమేస్త్రీ డీల్‌ మాట్లాడుకున్నారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంట నక్క ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్ర్తీ అంటున్నారని.. ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలను కలవడానికి బీఆర్‌ఎస్‌ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. ఇక, ప్రజల విషయంలో బీఆర్‌ఎస్‌ ఏవిధంగా లెక్కలేనితనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేనితనాన్ని కాంగ్రెస్‌ కూడా ప్రదర్శిస్తోందన్నారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్‌ ఎలా చెప్తారు?రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అని కవిత నిలదీశారు. కాగా, తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని.. ఈనెల 25న తమ కొత్తపార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నామని కవిత పేర్కొన్నారు.

కవిత సభకు జోరుగా ఏర్పాట్లు..

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌ గ్రామ పరిధిలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మునిరాబాద్‌లో ఆధ్య ఫంక్షన్‌హాల్‌లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. 25 వేల మంది కార్యక్రమానికి వస్తారని అంచనా. మేడ్చల్‌ జాతీయ రహదారి బోయినపల్లి నుంచిఓఆర్‌ఆర్‌ వరకు కవిత అభిమానులు ఇప్పటికే భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 22 , 2026 | 04:54 AM