బీఆర్‌ఎస్ పాలనపై.. కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం: మంత్రి దుద్దిళ్ల
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:49 AM
బీఆర్‌ఎస్ పాలనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత పాలకులు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేయాలన్నారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పాలనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత పాలకులు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలు డబుల్ 420 అని అభివర్ణించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీకి వస్తే ఆయన మర్యాదకి ఇబ్బంది రానివ్వబోమని పేర్కొన్నారు. హైడ్రా మంచిదని సాధారణ ప్రజలు చెబుతున్నారని తెలిపారు. హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీ తీస్తున్నారని చెప్పారు. అయితే హైడ్రా విషయంలో హైకోర్టు తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు. తాము చెప్పాల్సింది కోర్టుకు చెబుతామని తెలిపారు. రాజకీయం కోసమే హైడ్రాకు వ్యతిరేకంగా వేస్తున్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.