అహంకారం వల్లే అధికారం కోల్పోయారు
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:12 AM
అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, అహంకార ధోరణితో వ్యవహరించడం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.
పదేళ్లు అధికారమిస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు?
అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా వచ్చి కేసీఆర్ పక్కన చేరారు
ఎవరు గెలిచినా చేరేది బీఆర్‌ఎ్‌సలోనే అనే పరిస్థితి ఏర్పడింది
నేను జీ హుజూర్ అని ఉంటే పార్టీలో సమస్యే ఉండేది కాదు
క్యా హుజూర్? అన్నాను కాబట్టే ఇలా బయట ఉన్నాను
రెడ్డిగారూ.. ఉద్యమకారుల పట్ల ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి12(ఆంధ్రజ్యోతి): అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, అహంకార ధోరణితో వ్యవహరించడం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ధర్నాచౌక్ ఎత్తివేశారని, నాటి పాలకుల్లో అసహనం ఎక్కువైందని.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిని అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం బాగ్‌లింగంపల్లిలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవసభ కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ ప్రతిమకు పుష్పాంజలి ఘటించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ పదేళ్లు అధికారమిస్తే ఉద్యమకారులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేకపోయింది? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మొదటిసారి అధికారమిస్తే అన్ని పార్టీలూ బీఆర్‌ఎ్‌సలో విలీనమయ్యాయని, దీంతో ఏ పార్టీకి ఓటు వేసినా ఆ నేతలు బీఆర్‌ఎ్‌సలోకే వస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారంతా టీఆర్‌ఎ్‌సలోకి రావడాన్ని ఉద్యమకారులుగా తామెవ్వరం తట్టుకోలేకపోయాని ఆవేదన వ్యక్తంచేశారు. తమను పోలీసులతో కొట్టించినవారే తిరిగి కేసీఆర్ పక్కన కూర్చోవడం ఉద్యమకారులను బాధించిందన్నారు. తెలంగాణేతరులైన ఎంతోమందికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. కేశవరావు జాదవ్ పట్ల ఎందుకు వివక్ష చూపించిందని ప్రశ్నించారు. ఉద్యమకారుల పట్ల గత ప్రభుత్వ వైఖరిపై వారు బయట ఉండి బాధపడితే.. తాను పార్టీలో ఉండి బాధపడ్డానన్నారు. జీ హుజూర్ అని ఉంటే తాను బాగానే ఉండేదాన్నని.. క్యా హుజూర్ అన్నాను కాబట్టే బయటకు వచ్చానని చెప్పారు. అంతకుమించి ఇంటి గుట్టు బయటపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పట్లో ఉద్యమకారులను పొట్టనపెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉన్న కేబీఆర్ పార్కు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ఆ పేరుతో కొనసాగడం బాధాకరమన్నారు. ఆ పార్కు ముందు జయశంకర్ విగ్రహం పెట్టాలని ఆనాటి మునిసిపల్ శాఖ మంత్రిని తాను పదేపదే అడిగానని, అయినా లాభంలేకపోయిందని చెప్పారు.
ఇక ఇప్పుడు వచ్చిన ఆయనైతే ఎవరెవరి బొమ్మలు పెడుతున్నారో అర్థం కావడం లేదని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రవీంద్రభారతిలో గద్దర్, బిరుదురాజు రామరాజు, సుద్దాల హనుమంతు లాంటి మహనీయుల విగ్రహాలకు బదులు ఎవరెవరి విగ్రహాలున్నాయి? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు పట్టించుకోలేదు కాబట్టే పెద్దమనిషి (కేసీఆర్) ఓడిపోయారు. మీరూ అదే పనిచేస్తే బంగ్లా బయటకు గుంజుతాం రెడ్డిగారూ! ఒళ్లు దగ్గరపెట్టుకొని మరీ ఉద్యమకారుల పట్ల వ్యవహరించండి’’ అని హెచ్చరించారు. ఉద్యమకారుల సంక్షేమబోర్డు ఏర్పాటు చేస్తూ శాసనసభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబానికి ప్రతినెలా రూ.25వేల పెన్షన్‌తో పాటు ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ యోధులందరికీ 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రొఫెసర్ కోదండరామ్‌దేనన్నారు. తట్టెడు మట్టెత్తకుండానే కాంట్రాక్టర్లకు రూ.5వేలకోట్లు చెల్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. ఉద్యమకారులను పూర్తిగా విస్మరిస్తుంటే కోదండరామ్ ఎందుకు నోరుమెదపడం లేదు? అని ప్రశ్నించారు. ‘గురుకులాల్లో పిల్లలు చనిపోతుంటే ఏం చేస్తోంది మీ విద్యా కమిషన్ ఆకునూరి మురళీ సార్?’ అంటూ నిలదీశారు. కాగా తెలంగాణ వాదాన్ని నిలబెట్టడంతో పాటు ఈ నేల అస్తిత్వాన్ని పరిరక్షించడం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా తాను నెలకొల్పే రాజకీయ పార్టీ ఉంటుందని చెప్పారు. తెలంగాణలోని ప్రైవేటు సంస్థల్లో తప్పనిసరిగా 20శాతం ఉద్యోగాలు స్థానికులకు కేటాయించాలన్న డిమాండ్‌తో జాగృతి పోరాడుతుందని ప్రకటించారు. ఉద్యమకారుల కోసమే ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించినట్లు కవిత తెలిపారు. ఆ యాప్ డేటా ప్రకారం పోరాట యోధుల కుటుంబాలకు తెలంగాణ జాగృతి ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తుందని ప్రకటించారు.