Share News

పురపోరులో యువత..

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:59 AM

ప్రజాసేవపై తపన.. పదవి ఉంటే లభించే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు.

పురపోరులో యువత..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ప్రజాసేవపై తపన.. పదవి ఉంటే లభించే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు. పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచార సందడి మొదలైంది. ఈసారి యువత పోటీ పడుతుండడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓటర్లలో చర్చ మొదలైంది. పట్టణ అభివృద్ధి చేయాలనే ఆలోచనకు అనుగుణంగా యువత రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. వార్డుల్లో యువతను ప్రోత్సహిస్తున్న ఓటర్లు ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా, 283 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో సిరిసిల్ల మున్సిపాలిటీలో 170 మంది, వేములవాడలో 113 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో యువకులు, చదువుకున్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో యువత ముందుకు రావడం శుభ పరిణామంగానే రాజకీయవేత్తలు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువకులు, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకునే విధంగా దృష్టి పెడుతున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన యువతలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్హతలు ఉన్నవారు అధికంగా ఉన్నారు. కాగా, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో 283 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే 35 ఏళ్లలోపు వారు 66 మంది రంగంలో ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 170 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 39 మంది 35 ఏళ్లలోపు వారు ఉన్నారు. 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల పైబడిన వారు ఆరుగురు ఉన్నారు. తక్కువ వయస్సు ఉన్నవారిలో 22ఏళ్ల వయస్సు అభ్యర్థుల్లో నాగుల కావ్య, వడ్నాల రచన ఉండగా, 76 ఏళ్లు పత్తికొండ సత్తమ్మ, 71 ఏళ్ల అభ్యర్థిగా ఎర్రం వెంకట్రాజం, 67ఏళ్లలో బుర్ర నారాయణ, 69 ఏళ్లలో గడ్డం నరసవ్వ, 61 ఏళ్లలో కూరపాటి శ్రీశైలం, గోరింటాల లలిత పోటీలో ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 113 మంది పోటీలో ఉన్నారు. ఇందులో 35 ఏళ్ల వారు 27 మంది ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో ముగ్గురు ఉండగా, 73 ఏళ్ల సంగం అనుమవ్వ, 62 ఏళ్ల స్వామి, 61 ఏళ్ల నసీంఉన్నిసాబేగంలు పోటీలో ఉన్నారు. తక్కువ వయసున్న అభ్యర్థుల్లో 25 ఏళ్ల మానస్సీ, 26 ఏళ్ల కృష్ణ, 26 ఏళ్ల హర్షక్‌, 28 ఏళ్ల దిలీప్‌ కుమార్‌లు పోటీలో ఉన్నారు.

గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు 62 మంది..

మున్సిపల్‌ పోరులో చదువుకున్నవారే అధికంగా ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, అండర్‌గ్రాడ్యుయేట్లు పోటీలో ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడలో 283మంది అభ్యర్థుల్లో 251 మంది చదువుకున్నవారే ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభ్యర్థుల్లో 170 మందిలో 135 చదువుకున్న వారు ఉన్నారు. వీరిలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ వారు 39 మంది ఉన్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదివినవారు 135 మంది ఉన్నారు. చదువుకోని వారు 20 మంది అభ్యర్థులు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 113 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 93 మంది చదువుకున్న వారు ఉన్నారు. వీరిలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ చదివినవారు 23మంది ఉన్నారు. అండర్‌గ్ర్యాడ్యుయేట్‌ చదివిన వారు 70 మంది అభ్యర్థులు ఉన్నారు. చదువుకోని వారు 20 మంది అభ్యర్థులు ఉన్నారు. చదువుకున్న యువత పురపాలక సంఘాల్లో ప్రాతినిధ్యం పెరగడం ద్వారా పట్టణ సమస్యల పరిష్కారానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంతా భావిస్తున్నారు. మున్సిపాలిటీలో అవగాహనతో మాట్లాడడం, ప్రభుత్వం నుంచి నిధులు రావటానికి ధైర్యంగా ప్రయత్నం చేస్తారని చెప్పుకుంటున్నారు. పోటీలో ఉన్న యువత కూడా తమకు అవకాశం కల్పించాలని ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:59 AM